పరీక్షల వేళ ఉదయం అల్పాహారం తీసుకోవడం మంచిది. రోజూ సమయానికి భోజనం చేయాలి. ఉదయం త్వరగా జీర్ణమయ్యే అల్పాహారం, మధ్యాహ్నం మితంగా భోజనం మాత్రమే తీసుకోవాలి. రాత్రి నిద్రపోవడానికి కనీసం 2 గంటల ముందు భోజనం చేయడం ఉత్తమం. కనీసం 15 నిమిషాలు నడవడం వల్ల మానసిక ఒత్తిడి దూరమై ఆరోగ్యంగా ఉంటారు.
– మల్లెల వందన, వైద్యాధికారిణి
తిరుమలగిరి (తుంగతుర్తి) : పదో తరగతి పరీక్షలు శనివారం నుంచి ప్రారంభంకానున్నాయి. అయితే పరీక్షల భయంతో విద్యార్థులు హైరానా పడుతుంటారు. తిండి సరిగా తినరు. సమయానికి నిద్రపోరు. ఈ సమయంలో పరీక్షలకు సన్నద్ధమయ్యే పిల్లల ఆహారంపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సమతుల ఆహారం అందిస్తూ మనస్సుకు ప్రశాంతత చేకూరే వాతావరణం కల్పిస్తే ఒత్తిడిని అధిగమిస్తారని చెబుతున్నారు. వసతి గృహాల్లో ఉండే విద్యార్థులైతే పరీక్షల సమయంలో బరువు తగ్గిపోతున్నారని, పరీక్షలకు ఎంత కష్టపడి సన్నద్ధమవుతుంటారో అదే స్థాయిలో ఆరోగ్యంపై కూడా జాగ్రత్తలు తీసుకోవాలని, సరైన ఆహారం తీసుకోని విద్యార్థుల్లో ఎక్కువ చిరాకు, జ్ఞాపకశక్తి తక్కువగా ఉంటుందని విద్య, వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఆహారం తీసుకోండి ఇలా..
అల్పాహారం : ఉదయం అల్పాహారంలో విటమిన్ బి ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. ఇవి మెదడుకు అదనపు శక్తిని ఇస్తాయి.
● పొట్టుతో కూడిన పదార్థాలతో తయారుచేసిన ఇడ్లీ, పెసరట్టు, గోధుమ ఉప్మా, బ్రౌన్ బ్రెడ్, జొన్న రొట్టె వంటివి తీసుకోవడం మంచిది. వీటితో పాటు గ్లాసు పాలు, పండ్లు తీసుకోవడం మంచిది.
● పీచు పదార్థాలు, కెరోటిన్ వంటి ఇతర ఖనిజ లవణాలు ఎక్కువగా ఉండే ఆపిల్, నారింజ, క్యారెట్ మొక్కలు, బాదం, పిస్తాలు తీసుకోవాలి.
మధ్యాహ్న భోజనం : మధ్యాహ్నం అన్నం, గోధుమ రొట్టెలతో పాటు కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహారం(పాలకూర, ఆకుపచ్చ కూరగాయలు) తీసుకోవాలి. వాటిలో ఏకాగ్రత పెంచడానికి అవసరమైన పోషకాలు ఉంటాయి.
● అంతేకాకుండా పెరుగు, మజ్జిగ తప్పనిసరిగా తీసుకోవాలి.
రాత్రి భోజనం : రాత్రి పూట తేలికపాటి ఆహారం తీసుకోవాలి. పప్పు ధాన్యాలతో పాటు కోడిగుడ్డు తీసుకోవడం ఉత్తమం. రాత్రి 10 గంటల వరకు చదివి పాలు తాగి పడుకోవాలి. అన్నింటికంటే ముఖ్యంగా రోజూ తగినంత నీటిని తాగాలి. ఇలా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రశాంతతో చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు.
నిద్ర ఎంతో ముఖ్యం
పరీక్షల వేళ కొంతమంది విద్యార్థులు సమయానికి నిద్రపోరు. రాత్రంతా మేల్కోని చదువుతుంటారు. సరైన ఆహారం తినరు. ఇలా కొన్నిరోజులు అలవాటైతే తిండిపై ధ్యాస తగ్గిపోతుంది. ఎక్కువగా టీ, కాఫీలు తాగుతూ రాత్రంతా మేలుకొని ఉండటం వల్ల ఆకలి మందగిస్తుంది. దీంతో నిద్ర లేమికి గురవుతుంటారు. ఒత్తిడి అధిగమించేందుకు, జ్ఞాపకశక్తిని కలిగి ఉండేందుకు ఆహార పదార్థాలు తిన్న అరగంట వరకు మెదడుపై ప్రభావం ఉంటాయి. వీలైనంత వరకు బయటి ఫుడ్ తీసుకోకపోవడం ఉత్తమం.
ఫ విద్యార్థులకు తల్లిదండ్రులు
సమతుల ఆహారం ఇవ్వాలి
ఫ సమయానికి నిద్ర తప్పనిసరి అంటున్న వైద్య నిపుణులు


