ఈ సారి ప్రథమ స్థానమే లక్ష్యం
భువనగిరి: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు డీఈఓ సత్యనారాయణ తెలిపారు. ఎండల నేపథ్యంలో కేంద్రాల్లో అన్ని వసతులు ఉండేలా అన్ని శాఖల అధికారులతో చర్చించామని పేర్కొన్నారు. గతేడాది పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రంలో ఉత్తమ ఫలితాలు సాధించి యాదాద్రి భువనగిరి జిల్లా 7వ స్థానంలో నిలిచిందని, ఈ సారి ప్రథమ స్థానమే లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. పరీక్షల ఏర్పాట్లపై ఆయన మంగళవారం ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు.
కంట్రోల్ రూం ఏర్పాటు
పరీక్షల నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 50 కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఎండలను దృష్టిలో పెట్టుకుని మున్సిపాలిటీ, పంచాయతీరాజ్ శాఖ సమన్వయంతో కూల్ వాటర్‌ను ఏర్పాటు చేస్తున్నాం. విద్యుత్, ఫర్నిచర్, మూత్రశాలలు, మరుగుదొడ్లు వసతులు ఉండేలా చర్యలు తీసుకున్నాం. సందేహాల నివృత్తి కోసం ప్రత్యేకంగా డీఈఓ కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశాం. సందేహాలు ఉంటే 90107 72080 నంబర్‌కు ఫోన్ చేయాలి.
5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి
పదో తరగతి పరీక్షలకు 8930 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందులో 8913 మంది విద్యార్థులు రెగ్యులర్ కాగా 20 మంది ప్రైవేట్ విద్యార్థులు ఉన్నారు. పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటుంది. విద్యార్థులకు ఉదయం 9 గంటల లోపే కేంద్రాల వద్దకు చేరుకోవాలి. విద్యార్థులు 5 నిమిషాలు ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతి ఉంటుంది.
కేంద్రాల వద్ద బీఎన్‌ఎస్‌ఎస్ 163 సెక్షన్
పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు 50 మంది సీఎస్, 50 మంది డీఓలతో పాటు మూడు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశాం. వీరితో పాటు జిల్లాలో పరీక్షలను పర్యవేక్షించేందుకు పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటనర్సమ్మను ప్రత్యేకంగా నియమించారు. 572 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహించనున్నారు. ప్రతి కేంద్రం వద్ద బీఎన్‌ఎస్‌ఎస్ 163 సెక్షన్ అమలులో ఉంటుంది. పరీక్షల నిర్వహణ సమయంలో జీరాక్స్ సెంటర్లు మూసివేయాలి. సీఎస్ గదిలో సీసీ కెమెరాల నిఘా ఉంటుంది.
ఆర్టీసీ అధికారులతో చర్చించాం
అన్ని కేంద్రాల వైపు బస్సులు నడిపేలా ఆర్టీసీ అధికారులతో చర్చించాం. ఉదయం కేంద్రాలకు వచ్చే సమయంతోపాటు, మధ్యాహ్నం తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ వారికి సూచించాం. అదేవిధంగా పాఠశాలల్లో హాల్‌టికెట్ ఇవ్వకుంటే ఫిర్యాదు చేయొచ్చు. వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వాటిపై ప్రధానోపాధ్యాయుల సంతకం లేకున్నా కేంద్రంలోకి అనుమతి ఉంటుంది.
ఈ సారి ప్రథమ స్థానమే లక్ష్యంగా పాఠశాలల ప్రారంభం నుంచే ప్రత్యేక ప్రణాళికతో ఉపాధ్యాయుల సహకారంతో ముందుకు సాగుతున్నాం. ముందుగానే విద్యార్థులకు వేకప్ కాల్ పేరుతో తెల్లవారుజామునే పిల్లలను నిద్రలేపి చదివేటట్టు చేయడం, పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు, దత్తత పేరుతో పాఠశాలలు ఉన్న గ్రామంలో సీ గ్రేడు విద్యార్థులను గ్రామంలోని విద్యావంతులకు గాని అధికారులకు గాని అప్పగించి వారి పర్యవేక్షణలో చదివే విధంగా ఏర్పాటు చేశాం. ఈ సారి అభ్యసన దీపికలు అన్ని సబ్జెక్టులకు ఇవ్వడం జరిగింది. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు 200 సైకిళ్లను ఉచితంగా అందజేస్తామని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సారి పరీక్షలకు మధ్య రెండు నుంచి మూడు రోజుల వరకు గడువు ఉంది. విద్యార్థులకు ముందు జరిగే పరీక్షలకు సంసిద్ధం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో విద్యార్థులు పాఠశాలలకు రావాలి. ప్రధానంగా పరీక్షల సమయంలో విద్యార్థులపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి. టీవీలు, సెల్‌ఫోన్లకు దూరంగా ఉంచాలి.
ఫ 8930 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు
ఫ ఎండల నేపథ్యంలో కేంద్రాల్లో అన్ని వసతులు కల్పిస్తున్నాం
ఫ అత్యత్తమ ఫలితాలు సాధించిన 200 మంది విద్యార్థులకు సైకిళ్లు అందిస్తాం
ఫ సందేహాల నివృత్తికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు
‘సాక్షి’తో డీఈఓ సత్యనారాయణ


