మోటకొండూర్ : పాఠశాలల్లో విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి (డీఐఓ) రామకృష్ణ అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం మోటకొండూర్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాల, చందేపల్లిలోని అర్బన్ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా 600 మంది బాలికలు, 48 మంది బాలురకు పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందించారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ గాంధీ, డాక్టర్ స్వప్న, డాక్టర్ స్వప్న, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు కట్ట విజయ్, జయంత్, అనూష, గాయత్రి, సత్యనారాయణ, నరసింహ, ధనమ్మ తదితరులున్నారు.
మహిళా సంఘాలను బలోపేతం చేసుకోవాలి
ఆత్మకూరు(ఎం): మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసుకోవాలని అడిషనల్ డీఆర్‌డీఓ జంగారెడ్డి అన్నారు. మంగళవారం ఆత్మకూర్ (ఎం) మండల కేంద్రంలో మండల సమాఖ్య ఓబీ, గ్రామ సంఘాల ప్రతినిధులకు, సీనియర్ సీఆర్‌పీఎస్‌లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. మహిళా సంఘాల సభ్యులకు బ్యాంకు, సీ్త్రనిధి ద్వారా రుణాలు ఇప్పించి జీవనోపాధి కల్పించాలన్నారు. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి బ్యాంకుల అభివృద్ధికి సహకరించాలన్నారు. అవసరం అనుకుంటే మండల సమాఖ్య సబ్ కమిటీ వేయాలని చెప్పారు. గ్రామంలో ప్రతి సభ్యురాలు మహిళా సమ భావన సంఘాల్లో ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో డీపీఎం ఫైనాన్స్ వెంకటేశం, డీపీఎం ఫామ్, నాన్ ఫామ్ రవీందర్, ఏపీఎం నర్సింహ, డీఆర్‌పీ హరిలాల్, మండల సమాఖ్య అధ్యక్షురాలు రచ్చ పల్లవి, సీసీలు కొమురయ్య, హరిబాబు, సీఓ నల్ల చంద్రస్వామి, ఎంఎస్ మానస పాల్గొన్నారు.
యాదగిరీశుడి క్షేత్రంలో విశేష పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో విశేష పూజలు కొనసాగాయి. మంగళవారం క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి ఆకుపూజ జరిపించారు. ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి వారికి సుప్రభాతం, నిజాభిషేకం, ఆరాధన, అర్చన వంటి పూజలు చేపట్టారు. ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలు నిర్వహించారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణ వేడుక, బ్రహ్మోత్సవం శాస్త్రోక్తంగా జరిపించారు. సాయంత్రం వేళ జోడు సేవోత్సవం, రాత్రి శయనోత్సవం నిర్వహించి ఆలయాన్ని ద్వార బంధనం చేశారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.


