మేళ్లచెరువు : చింతలపాలెం మండలం చింత్రియాల పరిధిలోని కృష్ణా నది వద్దకు గేదెలు మేపేందుకు వెళ్లి అన్నదమ్ములు అదృశ్యమయ్యారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చింత్రియాలకు చెందిన షేక్ సైదుస్సేన్ కుమారులు సమీర్(12), సర్దార్ (13) ఏపీలోని పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని మదరసాలో అరబిక్ నేర్చుకుంటున్నారు. మూడురోజుల క్రితం ఇంటికి వచ్చారు. వారిద్దరు మంగళవారం గేదెలు మేపేందుకు చింత్రియాల సమీపంలోని కృష్ణానది వద్దకు వెళ్లి అదృశ్యమయ్యారు. సాయంత్రమైనా వారిద్దరు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు కృష్ణా నది తీరంలో వెతికినా వారి ఆచూకీ లభించలేదు. అయితే నది ఒడ్డున జాలర్లకు చెందిన పడవలు, వలలు ఉండడంతో చేపలు పట్టేందుకు నదిలోకి వల వేసి మునిగినట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇరువర్గాలపై కేసు నమోదు
చిలుకూరు : మండలంలోని పోలేనిగూడెంలో పక్క పక్క ఇళ్లలో ఉంటున్న ఇద్దరు గోడ విషయమై సోమవారం ఘర్షణ పడ్డారు. ఇరువురు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకోగా మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ హనుమాన్‌నాయక్ మంగళవారం తెలిపారు. బిట్టు నర్సయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు చందా వెంకటేశ్వర్లు, సుమలతతో పాటు మరో నలుగురిపై, అదేవిధంగా చందా సుమలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు బిట్టు నర్సయ్యపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
గంజాయి పట్టివేత
భువనగిరిటౌన్ : గంజాయి విక్రయిస్తున్న యువకుడిని మంగళవారం ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన సనౌలేక్ భువనగిరి పట్టణంలో గంజాయితో సంచరిస్తున్నాడని సమాచారం తెలియడంతో ఎకై ్సజ్ పోలీసులు అతడి అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 170 గ్రాముల గంజాయి, ఇతర మత్తుపదార్థాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎకై ్సజ్ పోలీసులు తెలిపారు.
10 లీటర్ల నాటుసారా..
కొండమల్లేపల్లి : ద్విచక్ర వాహనంపై నాటుసారా తరలిస్తున్న వ్యక్తిని మంగళవారం దేవరకొండ ఎకై ్సజ్ పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎకై ్సజ్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఈ తనిఖీల్లో ఎకై ్సజ్ ఎస్‌ఐ నర్సింగరావు, నరసింహ, వీరబాబు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.
ఇసుక లారీల పట్టివేత
కోదాడరూరల్ : ఏపీ నుంచి అనుమతి లేకుండా వస్తున్న ఇసుక లారీని కోదాడ రూరల్ పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. ఎస్‌ఐ గోపాల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం కేంద్రం సమీపంలోని మున్నేరు వాగు నుంచి లారీలో ఇసుకను లోడ్ చేసుకొని ఎలాంటి అనుమతులు లేకుండా హైదరాబాద్‌కు తరలిస్తుండగా.. రామాపురం క్రాస్‌రోడ్‌లో వాహనాల తనిఖీల్లో భాగంగా కోదాడ రూరల్ పోలీసులు పట్టుకున్నారు. లారీ యజమానితో పాటు డ్రైవర్ బిల్లా సాంబశివరావు, క్లీనర్ కారం శ్రీనివాసరావుపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
అప్పుల బాధతో ఆత్మహత్య
చందంపేట : మండలంలోని అచ్చంపేటపట్టి గ్రామానికి చెందిన జర్పుల పత్య(35) అప్పు ల బాధ తాళలేక మంగళవారం హైదరాబాద్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జర్పుల పత్య అచ్చంపేటపట్టి గ్రామంలో తనకున్న వ్యవసాయ పొలంతో పాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాడు. సరైన దిగుబడి రాక, పంట పెట్టుబడి కోసం చేసిన అప్పులు తీర్చే మార్గం లేక హైదరాబాద్‌లోని హస్తినాపురంలో అద్దె ఇంట్లో ఉంటూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో మంగళవారం హస్తినాపురంలోని అద్దె ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. పత్య మృతదేహాన్ని అచ్చంపేటపట్టి గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.


