పరిశీలించిన అధికారులు
శాలిగౌరారం : మండలంలోని వంగమర్తి వద్ద మూసీ నది సమీపంలోని ప్రభుత్వ ఇసుక రీచ్ నుంచి సంబంధిత కాంట్రాక్టర్ అక్రమంగా ఇసుకను తరలిస్తున్నాడని మండల కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు మంగళవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఇసుక రవాణాను అడ్డుకున్నారు. పలువురు నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వ అనుమతితో ఇసుక రీచ్ నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ సుమారు 50కి పైగా టిప్పర్లలో ఇసుకను అక్రమంగా తరలించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని ఆరోపించారు. మండల ఇసుక లారీల అసోసియేషన్ పరిధిలోని లారీలకు ఇసుక ఇండెంట్ లభించకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని అన్నారు. సంబంధిత అధికారులు కాంట్రాక్టర్‌కు సహకరించడం వల్లనే ఈ దందా కొనసాగుతుందని ఆరోపించారు. దామరచర్లలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ పేరుతో అనుమతులు పొంది ప్రైవేట్ వ్యక్తులు, నిర్మాణ సంస్థలకు ఇసుక అమ్ముకుంటూ అక్రమార్జనకు పాల్పడుతున్నారన్నారు. ఈ విషయమై పలుమార్లు ఉన్నతాధికారులకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో ఆందోళనకు దిగినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కందాల సమరంరెడ్డి, శాలిగౌరారం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పాదూరి శంకర్‌రెడ్డి, నాయకులు చామల అనిల్‌రెడ్డి, నూక కిరణ్‌కుమార్, అన్నెబోయిన సుధాకర్, నోముల జనార్ధన్, వడ్లకొండ పరమేశ్, చింత ధనుంజయ్య, తొట్ల పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇసుక క్వారీ వద్ద ఉద్రిక్తత..
కాంగ్రెస్ నాయకుల ఆందోళనతో ఇసుక రీచ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఉన్నతాధికారుల ఆదేశానుసారం ఇసుక క్వారీ వద్ద శాలిగౌరారం సీఐ కొండల్‌రెడ్డి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కాంట్రాక్టర్‌కు చెందిన ఇసుక టిప్పర్లను కాంగ్రెస్ నాయకులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు ఇసుక రవాణాను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పీఓ తెలుపడంతో నాయకులు ఆందోళన విరమించారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం నుంచి ఇసుక రవాణాకు సంబంధించి డీడీలు పొందిన అన్ని లారీలను సాయంత్రం అనుమతించారు.
నిలిచిపోయిన ఇసుక లారీలు
వంగమర్తిలో ప్రభుత్వ ఇసుక రీచ్ వద్ద లారీలను అడ్డుకుంటున్న కాంగ్రెస్ నాయకులు
ఇసుక రీచ్‌ను మైనింగ్ ఏడీ బాలు పరిశీలించారు. మూసీ ప్రాజెక్టులో ఇప్పటి వరకు జరిగిన ఇసుక పూడికతీత పనులు, ఎంతమేర పూడికతీతతో తవ్వకాలు జరుగుతున్నాయనే విషయాలను తెలుసుకున్నారు. ఆయన వెంట నీటిపారుదలశాఖ ఈఈ యాదగిరి, జియాలజిస్టు నామ కుమార్, మైనింగ్ పీఓ కిరణ్‌కుమార్ ఉన్నారు.
ఫ ప్రభుత్వ పనులకు అనుమతి తీసుకుని..
కాంట్రాక్టర్ ప్రైవేట్ వ్యక్తులకు ఇసుక అమ్ముకుంటున్నాడని ఆరోపణ
ఫ పోలీసులు, నాయకులకు
మధ్య వాగ్వాదం


