నార్కట్‌పల్లి : హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై నార్కట్‌పల్లి మండల పరిధిలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీకొని ఇద్దరు ట్రావెల్స్ బస్సు డ్రైవర్లు మృతి చెందగా.. మరో బస్సు క్లీనర్ తీవ్రంగా గాయపడ్డాడు. నార్కట్‌పల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి మోజో ట్రావెల్స్ బస్సు ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బయల్దేరి ఏపీలోని కాకినాడకు వెళ్తోంది. మంగళవారం తెల్లవారుజామున బస్సు నార్కట్‌పల్లి మండల పరిధిలోని నల్లగొండ ఎక్స్ రోడ్ ఫ్లైఓవర్ వద్దకు రాగానే.. లారీని ఓవర్‌టేక్ చేసే క్రమంలో లారీ, బస్సు స్వల్పంగా ఢీకొన్నాయి. దీంతో బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్ ఫ్లైఓవర్ పక్కన వాహనాలను వాదించుకుంటున్నారు. ఈ క్రమంలో కాకినాడకు వెళ్తున్న మరో మోజో ట్రావెల్స్ బస్సు అక్కడికి చేరుకోగా.. ఆ బస్సు డ్రైవర్లు పస్తం శ్రీనివాస్(30), చిట్టకేనా బంగారయ్య(45) బస్సును పక్కకు ఆపి అప్పటికే వాదించుకుంటున్న బస్సు, లారీ డ్రైవర్లతో మాట్లాడుతున్నారు. అదే సమయంలో విజయవాడ వైపు వెళ్తున్న మరో లారీ ప్రమాదానికి గురై రోడ్డు పక్కన ఆపిన లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో నలుగురు డ్రైవర్లు రెండు లారీల మధ్య ఇరుక్కుపోయారు. ఈ ప్రమాదంలో ట్రావెల్స్ బస్సు డ్రైవర్లు పస్తం శ్రీనివాస్, చిట్టికేనా బంగారయ్య అక్కడికక్కడే మృతిచెందగా.. మొదట ప్రమాదానికి గురైన బస్సు క్లీనర్ సురేష్‌కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న నార్కట్‌పల్లి సీఐ, నార్కట్‌పల్లి, చిట్యాల ఎస్‌ఐలు ఘటనా స్థలానికి చేరుకుని రెండు లారీలు, బస్సును పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శ్రీనివాస్, బంగారయ్య మృతదేహాలను నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. గాయపడిన క్లీనర్ సురేష్‌ను నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నార్కట్‌పల్లి ఎస్‌ఐ విష్ణుమూర్తి తెలిపారు. మృతుడు శ్రీనివాస్ హైదరాబాద్‌లోని మెహిదీపట్నం సమీపంలోని గుడిమల్కాపురం వాంబే కాలనీలో నివాసముంటుండగా.. బంగారయ్య స్వస్థలం ఏపీలోని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జొన్నాడ అని ఎస్‌ఐ పేర్కొన్నారు.
ఫ లారీ ఢీకొని ఇద్దరు
ట్రావెల్స్ బస్సు డ్రైవర్లు మృతి
ఫ మరో బస్సు క్లీనర్‌కు తీవ్ర గాయాలు


