గుర్రంపోడు : పండ్ల తోటలు సాగు చేసే రైతులకు వేసవిలో అగ్ని ప్రమాదాలు కలవరపాటుకు గురిచేస్తాయి. 20 ఏళ్ల పాటు దిగుబడులు ఇచ్చే బత్తాయి, నిమ్మ తోటలు అగ్ని ప్రమాదాలకు గురైతే రైతు ఆర్థికంగా కోలుకోవడం కష్టమే. ప్రతి ఏడాది వేసవిలో అగ్ని ప్రమాదాల కారణంగా పండ్ల తోటలు కాలిపోతుండగా.. అధికారులు నష్టం అంచనా వేస్తున్నా పరిహారం అందించిన దాఖలాలు లేవు. రెండు రోజుల క్రితం గుర్రంపోడు మండలం కొప్పోలు గ్రామంలో పక్క పొలం రైతు చెత్తను తగలబెట్టేందుకు నిప్పు పెట్టగా ఆ మంటలు వ్యాపించి పక్కే గల బత్తాయి తోటలో 70 చెట్లు కాలిపోయాయి. వేసవిలో అగ్ని ప్రమాదాలు జరగకుండా రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అనుముల క్లస్టర్ ప్రాంతీయ ఉద్యానవన అధికారి మురళి వివరించారు. ఆయన సూచనలు, సలహాలు ఇవీ..
ఫ రైతులు మోటార్ల సర్వీసు వైర్లు, కేబుల్ వైర్లు అతుకులు లేకుండా చూసుకోవాలి. నేల మీద వైర్లు లేకుండా చూసుకోవాలి. ఎండ వేడిమికి షార్ట్ సర్క్యూట్‌తో ఎండిన ఆకులకు నిప్పంటుకుంటుంది.
ఫ విద్యుత్ సర్వీసు వైర్లు, ఫ్యూజుల నుంచి స్టార్టర్ వరకు గల వైరు నాసిరకంగా ఉంటే లోఓల్టేజీతో కాలిపోయి మంటలు అంటుకుని వ్యాపించే అవకాశం ఉంది.
ఫ స్టార్టర్ డబ్బాలు నేలపై అడ్డంగా ఉంచడం వల్ల ఎలుకలు దూరి వైర్లు కత్తిరించడం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి ఎండు ఆకులకు మంటలు అంటుకుంటాయి.
ఫ తోటల్లో కరెంటు స్తంభాల మధ్య లూజ్ లైన్ లేకుండా చూసుకోవాలి. లూజ్ లైన్ల వల్ల గాలిదుమారాలకు తీగలు ఒకదానికొకటి తగిలి నిప్పురవ్వలు నేలపై పడి కింద ఉన్న గడ్డికి అంటుకుంటాయి.
ఫ తోటల్లో చెట్ల మధ్యలో వేసవికి ముందే దన్నుకోవాలి. కలుపు మందులు వాడితే ఎండిన గడ్డిని పీకివేయాలి.
ఫ ఎట్టి పరిస్థితుల్లో వేసవిలో తోటల్లో చెత్తకు నిప్పుపెట్టకూడదు.
ఫ తోటల చుట్టూ కంచె ఉంటే అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మంటలు అదుపులో ఉండేందుకు కంచె మధ్యలో ఎడం ఉండేలా ఖాళీ స్థలం ఉంచుకోవాలి.
ఫ తోట గెట్ల వెంట గడ్డివాములు ఉంచకూడదు.
ఫ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తోటల్లో అంతరకృషి లేకుండా ఎండు గడ్డి బాగా ఉంటే డ్రిప్ లాటరల్ పైపులు కాలిపోయి తీవ్ర నష్టం జరుగుతుంది.


