నల్లగొండ: వైన్ షాపులో చోరీ చేసిన దొంగను పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం నల్లగొండ వన్‌టౌన్ సీఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డులో గల మహాలక్ష్మి వైన్ షాపులో గతేడాది డిసెంబరు 7న అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తి చొరబడి రూ.5 లక్షలకు పైగా నగదు ఎత్తుకెళ్లాడు. షాపు యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా చోరీకి పాల్పడింది వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద్ మల్లాపూర్ గ్రామానికి చెందిన కుమ్మరి నర్సింహరావుగా పోలీసులు గుర్తించారు. మంగళవారం నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో అనుమానాస్పదంగా తిరుగుతున్న నర్సింహారావును అదుపులోకి తీసుకొని విచారించగా.. మూడు వైన్ షాపుల్లో చోరీలు చేసినట్లు నిజం ఒప్పుకున్నాడు. అతడి నుంచి రూ.1.77లక్షల నగదు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. నర్సింహారావు గతంలో వంట మాస్టర్‌గా పనిశాడని, అతడు ప్రస్తుతం ఏపీలోని గుంటూరు జిల్లా బెల్లంకొండ మండలం మచ్చయపాలెం గ్రామంలో నివాసముంటున్నట్లు సీఐ పేర్కొన్నారు. నిందితుడిపై ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయని, జైలుకు కూడా వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చినట్లు తెలిపారు.


