హాలియా : నానో యూరియా, నానో డీఏపీతో భూసారం పెరగడంతో పాటు దిగుబడి మెరుగవుతుందని కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం కీటక శాస్త్రవేత రాములమ్మ, ఉద్యాన పంటల శాస్త్రవేత్త బిందు అన్నారు. మంగళవారం అనుముల రైతు వేదికలో సేంద్రియ వ్యవసాయం, నానో ఎరువుల వాడకం, హెచ్‌టీ పత్తి సాగు, ఆయిల్ పామ్, కిచెన్ గార్డెనింగ్‌పై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో వారు పాల్గొని మాట్లాడారు. యూరియా, డీఏపీని మోతాదుకు మించి వాడటం వల్లే భూసారం తగ్గి పంట దిగుబడి పడిపోతుందన్నారు. నానో యూరియా చాలా తక్కువ ధరకు దొరుకుతుందని, తక్కువ శ్రమతో అధిక దిగుబడి సాధించవచ్చన్నారు. యూరియా సరైన సమయంలో అందుబాటులో లేకపోతే నానో యూరియాను స్ప్రే చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చని తెలిపారు. అధిక మోతాదులో యూరియా వినియోగం వలన పురుగులు, తెగుళ్లు పెరగడంతో పాటు నేల, నీరు, వాతావరణం కాలుష్యం అవుతుందని, దాని ప్రభావం మనుషుల ఆరోగ్యంపై కూడా పడే అవకాశం ఉందన్నారు. రైతులు మేలైన విత్తనాలను ఎంపిక చేసుకున్నప్పుడే అధిక దిగుబడులు పొందవచ్చన్నారు. అధిక సాంద్రత కలిగిన పత్తి సాగు చేస్తే కూలీల ఖర్చు, పంట కాలం తగ్గడంతో పాటు అధిక దిగుబడి వస్తుందన్నారు. ఏడీఏ సరిత మాట్లాడుతూ.. సస్యరక్షణ చర్యలు, సాగులో మెళకువలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఏటీఎంఏ వైస్ చైర్మన్ వేణుగోపాల్, ఏఓ వెంకన్న, హర్షిత, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.


