బోటు.. మరమ్మతుల్లో ఎందుకులేటు
డీలక్స్ బోటు ఏది?
భువనగిరి: రాయగిరి చెరువులో డీలక్స్ బోటు మరమ్మతులకు గురైంది. రెండు నెలలు గడుస్తున్నా నేటికీ అధికారులు ఆ బోటును అందుబాటులోకి తీసుకురావడం లేదు. దీంతో పర్యాటకులు నిరాశచెందుతున్నారు. భువనగిరి మండలం రాయగిరి చెరువు సమీపంలో రూ. 5 కోట్లతో మినీ శిల్పారా మం నిర్మించారు. దీనిని 2024లో ప్రారంభించారు. ఇందులో చేతి వృత్తులకు సంబంధించి వస్తువులు విక్రయించుకునేందుకు స్టాల్స్, ఉయ్యాలలు, చిన్న పిల్లల కోసం ఆటవస్తువులు ఏర్పాటు చేశారు. శని, ఆదివారం రోజుల్లో మినీ శిల్పారామం సంస్థ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. పర్యాటకులను ఆకర్షించేందుకు, ఆహ్లా దాన్ని పంచేందుకు చెరువులో బోట్లు ఏర్పాటు చేశారు.
వారాంతంలో పర్యాటకుల సందడి
మినీ శిల్పారామంలో వారాంతపు రోజులైన శని, ఆదివారం సందర్శకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఇందులో ప్రత్యేకంగా మినీ శిల్పారామాన్ని సందర్శించేందుకు వచ్చిన వారు కాగా.. మరికొందరు యాదగిరిగుట్టలో స్వామి వారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో శిల్పారామానికి వస్తుంటారు. సాధారణ రోజుల్లో రోజుకు 500 నుంచి 650 వరకు పర్యాటకులు వస్తుండగా వారాంతపు రోజుల్లో 1,100 నుంచి 1300 మంది వరకు వస్తుంటారు. మినీ శిల్పారామంలో ఏర్పాటు చేసిన వాటిని తిలకిస్తూ ఆహ్లాదాన్ని పొందుతూ సేదతీరుతుంటారు. ఇక్కడ ఏర్పాటు చేసిన బోటులో విహరిస్తుంటారు.
ఫ రాయగిరిలోని శిల్పారామంలో రెండు నెలల క్రితం మరమ్మతులకు గురైన డీలక్స్ బోటు
ఫ నేటికీ అందుబాటులోకి రాని వైనం
ఫ నిరాశ చెందుతున్న పర్యాటకులు
పర్యాటకులు చెరువులో విహరిస్తూ ఆహ్లాదాన్ని పొందేందుకు మూడు బోట్లు ఏర్పాటు చేశారు. ఇందులో డీలక్స్ బోటు, స్పీడ్ బోటు, పెడల్ బోటు ఉన్నాయి. డీలక్స్ బోటులో విహరించేందుకు పెద్దలకు రూ. 50, చిన్నారులకు రూ. 30, స్పీడ్ బోటుకు నలుగురికి కలిపి రూ. 400, పెడల్ బోటుకు ఇద్దరి నుంచి నలుగురికి రూ. 200 చొప్పున రుసుము చెల్లించాలి. స్పీడ్ బోటు, పెడల్ బోట్లు మినీ శిల్పారామం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డీలక్స్ బోటు రెండు నెలల క్రితం మరమ్మతులకు గురైంది. ఇప్పటి వరకు ఈ బోటును అందుబాటులోకి తీసుకురాలేదు. ఈ బోటులో సుమారు 15 మంది విహరించే అవకాశం ఉంది. మరమ్మతులకు గురైన డీలక్స్ బోటు లేకపోవడంతో పర్యాటకులు నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం మేడారం జాతర ప్రారంభం కావడంతో జాతర నుంచి తిరిగి ప్రయాణంలో మినీ శిల్పారామం సందర్శించేవారి సంఖ్య పెరిగే అవకాశం లేకపోలేదు.


