చిన్నారి ఊపిరి తీసిన బాటిల్ మూత
భూదాన్‌పోచంపల్లి: థమ్సప్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కొని ఊపిరాడక చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన భూదాన్‌పోచంపల్లి మండలం ఇంద్రియాల గ్రామంలో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంద్రియాల గ్రామానికి చెందిన బందారపు శ్రీకాంత్‌గౌడ్, నాగరాణి దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె భవ్యశ్రీ(18 నెలలు) ఉన్నారు. శ్రీకాంత్‌గౌడ్ గుజరాత్‌లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా.. నాగరాణి తన అత్తతో కలిసి ఇంద్రియాలలో ఉంటుంది. సోమవారం మధ్యాహ్నం నాగరాణి తన కుమార్తె భవ్యశ్రీకి ఆడుకోవడానికి ఆట వస్తువులు ఇచ్చి బయట దుస్తులు ఉతుకుతోంది. భవ్యశ్రీ ఆడుకుంటూ కిందపడి ఉన్న థమ్సప్ మూతను నోట్లో పెట్టుకోగా.. గొంతులో ఇరుక్కొని ఊపిరాడక మృతిచెందింది. బట్టలు ఉతికిన తర్వాత నాగరాణి ఇంట్లోకి వచ్చి చూడగా కుమార్తె భవ్యశ్రీ ఉలుకు పలుకు లేకుండా ఉండటం చూసి ఆందోళన చెంది వెంటనే బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే చిన్నారి మృతిచెందినట్లు నిర్ధారించారు. కళ్ల ముందే ఆడుకుంటున్న భవ్యశ్రీ మృతిచెందడంతో తల్లి నాగరాణి, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఫ గొంతులో ఇరుక్కొని మృతి


