ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం
సాక్షి,యాదాద్రి : జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో ఎన్నికలను సమర్థంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ హనుమంతరావు, ఎస్పీ అక్షాంశ్‌యాదవ్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఇతర అధికారులతో కలిసి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లతో మున్సిపల్ ఎన్నికలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో స్థానిక కలెక్టరేట్‌లో కలెక్టర్, ఎస్పీలు పాల్గొని మాట్లాడారు. మోడల్ కోడ్‌ను కూడా పకడ్బందీగా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల సమయంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా పోలీసు శాఖ పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల విధుల్లో తగినంత సిబ్బందిని నియమిస్తామన్నారు. కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, ఆర్టీఓలు కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి , జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.


