జీవాలకు అమ్మతల్లి టీకాలు
నల్లగొండ అగ్రికల్చర్ : గొర్రెలు, మేకల్లో చలికాలంలో వ్యాప్తి చెందే అమ్మతల్లి రోగాన్ని నివారించేందుకు జిల్లా పశువైద్య సంవర్థక శాఖ ఆధ్వర్యంలో గురువారం నుంచి 22వ తేదీ వరకు రోగ నిరోదక టీకాల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.దీ ఒక్కసారి టీకాలు వేస్తే జీవాలలో మూడు సంవత్సరాల వరకు వ్యాధి నిరోధక శక్తి ఉంటుంది. మూడు నెలల నిండిన పిల్లల నుంచి టీకాలు వేయనున్నారు. జీవాల సంఖ్యలో మూడోవంతు జీవాలకు టీకాలను వేయడానికి జిల్లా పశువైద్య సంవర్థక శాఖ ఏర్పాట్లు చేసింది. జిల్లా వ్యాప్తంగా 10 లక్షల వరకు గొర్రెలు, 3 లక్షల వరకు మేకలు ఉన్నట్లు గణాంకాలు చెపుతున్నాయి. వీటన్నింటిని రోగ నిరోధక టీకాలను వేయడానికి గాను 78 బృందాలను ఏర్పాటు చేశారు. ఆయా బృందాలు ఉదయం 8 గంటలకు గ్రామాలకు చేరుకుని పెంపకందారులకు మందల వద్దకు చేరుకుని జీవాలకు టీకాలను వేయనున్నారు. ఇప్పటికే టీకాలు జిల్లాకు చేరుకోవడంతో వాటిని ఆయా మండల పశువైద్యశాలలకు పంపిణీ చేశారు.
వ్యాధి లక్షణాలు...
వ్యాధి సోకిన గొర్రెల, మేకల్లో జ్వరం 104 నుంచి 106 డిగ్రీల వరకు ఉంటుంది. మేత తినవు, నీరసంగా ఉంటాయి. కళ్ల నుంచి నీరు కారడం, పెదవులు, నోరు వాపుగా ఉంటుంది. చర్మంపై ఎర్రమచ్చలు, చర్మగట్టి పడడం, నీటి బుడగలు ఏర్పడడం, చీము బుడగలు ఏర్పడుతాయి. నోరు, ముక్కు, కళ్లచుట్టూ, వృషణాలు, తొడల లోపల, వెంట్రుకలు లేని ప్రదేశాల్లో పైవన్నీ ఏర్పడుతాయి. వ్యాధి తీవ్రతను బట్టి మరణాలు కూడా సంభవిస్తాయి. లక్షణాలు, పాక్స్ గడ్డల ఆధారంగా ఈ వ్యాధిని నిర్ధారిస్తారు.
ఫ నేటి నుంచి వ్యాక్సినేషన్


