ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
సూర్యాపేటటౌన్ : ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. గురువారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట పట్టణంలోని జాకీర్‌హుస్సేన్ నగర్‌కు చెందిన ధరావత్ చాంప్లా(50) కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. బుధవారం సాయంత్రం కొత్త వ్యవసాయ మార్కెట్‌లో చెట్టుకు తాడుతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం మృతుడి కుమారుడు రాహుల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు.
చెట్టుపై నుంచి పడి
వ్యక్తి దుర్మరణం
పెన్‌పహాడ్ : చెట్టుపై నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన పెన్‌పహాడ్ మండలం మాచారం గ్రామంలో గురువారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పెన్‌పహాడ్ మండల కేంద్రానికి చెందిన దాసరి కోటయ్య(50) దినసరి కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం మచారం గ్రామంలోని ఎస్సీ కాలనీలో చెట్టు కొమ్మలను మిషన్‌తో తొలగిస్తుండగా.. ప్రమాదశాత్తు జారి కిందపడి తీవ్రంగా గాపడ్డాడు. స్థానికులు 108 వాహనంలో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాదాద్‌లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య విజయతో పాటు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు.
చికిత్స పొందుతూ
నవజాత శిశువు మృతి
భువనగిరి(బీబీనగర్): బీబీనగర్ మండలం పడమటిసోమారం మంలోని లింగ బసవేశ్వరస్వామి దేవాలయం వద్ద ఈ నెల 6న గుర్తుతెలియని మహిళ నవజాత ఆడ శివువును వదిలి వెళ్లగా.. గ్రామస్తులు గుర్తించి భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం శిశువు మృతి చెందింది. శిశువు చలిలో ఉండటం వల్ల హార్ట్‌బీట్, శరీర ఉష్ణోగ్రత తగ్గిందని, సీపీఆర్ చేసినప్పటికీ శిశువు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారని జిల్లా సంక్షేమ శాఖ అధికారి నరసింహారావు గురువారం చెప్పారు.
జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఎంపిక
మోత్కూరు : మహారాష్ట్రలో ఈ నెల 9, 10, 11 తేదీల్లో జరిగే జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఆత్మకూరు
(ఎం) మండలం కొరటికల్ గ్రామానికి చెందిన సీహెచ్. శ్రవణ్‌కుమార్, మోటకొండూర్ మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన మనోజ్ ఎంపికయ్యారు. వరంగల్ జిల్లాలో జరిగిన 44వ రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో వారు పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయికి ఎంపికై నట్లు షూటింగ్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోత్కూరు యాదయ్య గురువారం పేర్కొన్నారు.
హాకీ పోటీలకు ఎంపికై న రామన్నపేట విద్యార్థి
రామన్నపేట : తమిళనాడులో ఈనెల 12 నుంచి జరిగే విశ్వవిద్యాలయాల జాతీయస్థాయి హాకీ పోటీల్లో రామన్నపేట డిగ్రీ కళాశాలకు చెందిన నోముల సాయికుమార్ పాల్గొననున్నాడు. గురువారం జరిగిన ఎంపిక ప్రక్రియలో సాయికుమార్ పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చి మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం జట్టుకు ఎంపికయ్యాడు. మహాత్మాగాంధీ యూనివర్సిటీ జట్టు తరఫున సాయికుమార్ బరిలో దిగనున్నాడు.


