గురుకులం పిలుస్తోంది!
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తులు ప్రారంభం : డిసెంబర్ 11, 2025
దరఖాస్తులకు గడువు : జనవరి 21, 2026
ప్రవేశ పరీక్ష : ఫిబ్రవరి 22, 2026
పూర్తి వివరాలు: టీజీసెట్.సీజీజీ.జీవోవీ.ఇన్
ఐదో తరగతిలో ప్రవేశాలకు
ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ
21వ తేదీ వరకు దరఖాస్తులకు
అవకాశం
పెద్దవూర: తెలంగాణ ప్రభుత్వ గురుకుల విద్యాలయాల్లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఐదో తరగతిలో ప్రవేశానికి, ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ మేరకు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈ ఐఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ గత నెల 11వ తేదీన ప్రారంభంకాగా.. ఈనెల 21వ తేదీ వరకు అవకాశం ఉంది. ప్రవేశ పరీక్ష రుసుం రూ.100లు ఆన్‌లైన్‌లో చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ఫిబ్రవరి 22న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఎంపిక చేసిన కేంద్రాల్లో ఉదయం 11 గంటలకు పరీక్ష ప్రారంభమై మధ్యాహ్నం 1 గంటకు ముగుస్తుంది. విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
దరఖాస్తుదారులకు సూచనలు
ఐదవ తరగతిలో ప్రవేశానికి విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరంలో నాల్గో తరగతి చదువుతుండాలి. ఆరు నుంచి తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి గాను వరుసగా ఐదు నుంచి ఎనిమిదో తరగతి చదువుతుండాలి.
ఐదవ తరగతిలో ప్రవేశాలకు ఓసీ, బీసీ, బీసీ మైనారిటీ విద్యార్థులు 9 నుంచి 11 ఏళ్ల మధ్య, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 9 నుంచి 13 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి. ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు వరుసగా ఓసీ, బీసీ, బీసీ మైనారిటీలకు 10 నుంచి 15 ఏళ్ల మద్య, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 10 నుంచి 17 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి.
విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణం ప్రాంతం వారికి రూ.1,50,000లు, పట్టణ ప్రాంతం వారికి రూ.2 లక్షలకు మించకూడదు.
ప్రవేశ పరీక్ష పూర్తిగా అబ్జెక్టీవ్ పద్ధతిలో ఓఎంఆర్ షీట్ విధానంలో 100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ఉంటుంది. తెలుగు (20 మార్కులు), ఇంగ్లిష్(25 మార్కులు), గణితం(25 మార్కులు), మెంటల్ ఎబిలిటీ(10 మార్కులు), పరిసరాల విజ్ఞానం(20 మార్కులు) సబ్జెక్టులలో నాలుగో తరగతి స్థాయిలో ప్రశ్నంటాయి.
విద్యార్థులకు ప్రవేశ పరీక్షలో వచ్చిన మెరిట్ మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.
ఐదవ తరగతిలో ప్రవేశానికి ప్రస్తుత విద్యా సంవత్సరంలో నాల్గో తరగతి చదువుతున్నట్లుగా, ఆరో తరగతిలో 5వ తరగతి, 7వ తరగతిలో 6, 8వ తరగతికి 7వ, 9వ తరగతికి 8వ తరగతి చదువుతున్నట్లు సంబంధిత పాఠశాల నుంచి బోనఫైడ్/స్టడీ సర్టిఫికెట్‌ను దరఖాస్తుతో పాటు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి.
విద్యార్థుల ఎంపికకు ఉమ్మడి జిల్లాను యూనిట్‌గా పరిగణిస్తారు.
ఇతర సమాచారం కోసం హెల్ప్‌లైన్ నంబర్ 1800 42545678ను ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించవచ్చు.
విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి ప్రభుత్వ గురుకులాలు ఎంతగానో దోహదపడుతున్నాయి. కార్పొరేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోకుండా అన్ని ప్రమాణాలతో బోధన చేసి విద్యార్థులను అన్ని విధాలా తీర్చిదిద్దడానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రత్యేకించి విద్యార్థులలో క్రమశిక్షణ, ఆటలపై ఆసక్తి, ధ్యానం ఇతర అన్ని విధాలా విద్యార్థుల ఆసక్తికి అనుగుణంగా ప్రోత్సహకాన్ని అందిస్తున్నాం. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.
– మంగ్తా భూక్యా, ప్రిన్సిపాల్, తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయం, పెద్దవూర
గురుకులం పిలుస్తోంది!


