పెళ్లికి నిరాకరించాడని..
చందంపేట : రెండు సంవత్సరాలుగా ప్రేమించి, తీరా ప్రభుత్వ ఉద్యోగం రావడంతో పెళ్లికి నిరాకరించాడని ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన ఆదివారం నేరెడుగొమ్ము మండలంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. నేరెడుగొమ్ము మండల కేంద్రానికి చెందిన పులికంటి శ్రీను, అదే గ్రామానికి చెందిన నిరసనమెట్ల మంజుల ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. శ్రీనుకు కొన్ని నెలల క్రితం రైల్వేలో ఉద్యోగం వచ్చింది. యువతి డిగ్రీ చదువుతోంది. వీరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ప్రభుత్వ కొలువు వచ్చిన నాటి నుంచి తనను వివాహం చేసుకునేందుకు నిరాకరిస్తుండడంతో మంజుల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. గ్రామంలో పెద్దమనుషుల మధ్య మాట్లాడేందుకు శ్రీను రాకపోవడంతో గత నెల 24వ తేదీన అతడి ఇంటి ఎదుట పెట్రోల్ బాటిల్‌తో బైఠాయించింది. అంతకుముందే విషయం తెలుసుకున్న శ్రీను, అతడి కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసి వ్యవసాయ పొలానికి వెళ్లారు. యువతి కుటుంబసభ్యులు, బంధువులు అక్కడకు వెళ్లగా వీరి మధ్య వాగ్వాదం నెలకొంది. తాజాగా శనివారం మాట్లాడేందుకు శ్రీను, మంజుల తరపున కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. వీరి మధ్య మాటామాటా పెరగడం, శ్రీను వివాహం చేసుకునేందుకు అంగీకరించకపోవడంతో యువతి తన వెంట తెచ్చుకున్న డెటాల్‌ను తాగింది. గమనించిన సీఐ బీసన్న చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం యువతిని ఆదివారం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. తమకు న్యాయం చేయాలంటూ యువతి తరపు బంధువులు కోరుతున్నారు.
● యువతి ఆత్మహత్యాయత్నం
● నేరెడుగొమ్ము మండల కేంద్రంలో ఘటన


