ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారించాలి
హుజూర్‌నగర్ : కర్ల రాజేష్ మృతిపై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేశారు. శనివారం హుజూర్‌నగర్‌కు వచ్చిన ఆయన పట్టణంలోని బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం సబ్ జైలును, ఏరియా హాస్పిటల్‌ను సందర్శించి జైలు అధికారులను, డాక్టర్లను అడిగి కర్ల రాజేష్ మృతికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కర్ల రాజేష్‌ను చిత్రహింసలు పెట్టడం వలనే మృతిచెందాడని ఆరోపించారు. రాజేష్ మృతిపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని, ఇందులో సూర్యాపేటకు సంబంధించిన అధికారులు ఎవరూ ఉండొద్దని కోరారు. రాజేష్‌పై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, అతడిని రిమాండ్ చేసే సమయంలోనే కోర్టు ప్రాంగణంలో హైకార్డ్ అనే ఇంజెక్షన్ వేశారని ఆరోపించారు. రాజేష్ మృతికి ప్రధాన కారకుడు చిలుకూరు ఎస్‌ఐ, సరైన నిర్ణయం తీసుకోలేని కోదాడ రూరల్ సీఐ అని.. వారిద్దరిని శిక్షించాలని కోరినప్పటికీ కేవలం సీఐని మాత్రమే వీధుల నుంచి తొలగించారని, ఎస్‌ఐని ఇంకా విధుల్లోనే ఉంచారని అన్నారు. దళితుల మీద ఫిర్యాదు వస్తే నిమిషాల్లో కేసులు నమోదు చేస్తారని, అదే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎస్‌ఐపై కూడా కేసు ఉన్నప్పటికీ ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని ప్రశ్నించారు. ఎస్‌ఐ సురేష్‌రెడ్డిని కాపాడే మొదటి వ్యక్తి కోదాడ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి కాగా.. ఇతర అధికారులు, డీఐజీతో సహా అందరూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారేనని ఆరోపించారు. రాజేష్ రిమాండ్ రిపోర్ట్ మొత్తం తప్పుల తడకగా ఉందని, రాజేష్ మృతికి కారణమైన ఎస్‌ఐ, సీఐలను కాపాడేందుకు సూర్యాపేట జిల్లా ఎస్పీ కూడా ప్రధాన భూమిక పోషించారని విమర్శించారు. ప్రభుత్వం సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, డీజీపీ, మంత్రి ఉత్తమ్ సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు బచ్చలకూరి వెంకటేశ్వర్లు బచ్చలకూరి ప్రసాద్, చింతిరాల నాగయ్య, బాలచంద్రుడు, మంద నాగరాజు, ఒగ్గు విశాఖ, రెడపంగు వెంకటేశ్వర్లు మంద వెంకటేశ్వర్లు మీసాల శరత్ తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ


