భూ వివాదంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ
రామగిరి(నల్లగొండ): నల్లగొండ మండలం కొత్తపల్లి గ్రామంలో శనివారం భూ వివాదంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వివరాలు.. కొత్తపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 82లో అదే గ్రామానికి చెందిన జిల్లేపల్లి పెదమారయ్య, చినమారయ్య, వెంకటేశం, శ్రీనయ్య కుటుంబ సభ్యులకు 6 ఎకరాల పట్టా భూమి ఉంది. వారసత్వంగా వచ్చి భూమి కావడంతో వారు సాగు చేసుకుంటున్నారు. అదే సర్వే నంబర్ 82లో అదే గ్రామానికి చెందిన నారబోయిన నరసింహ, వెంకన్న, మారయ్య, పరశురాములు, రాజు, శ్రీశైలం, శివరామకృష్ణ, జెట్టి జానకిరాములుకు 3 ఎకరాల భూమి పట్టా ఉంది. మరో 2 ఎకరాల భూమి విషయమై రెండు వర్గాల మధ్య కొంతకాలంగా వివాదం జరుగుతోంది. శనివారం నారబోయిన నరసింహ కుటుంబ సభ్యులు ట్రాక్టర్ల సహాయంతో పెదమారయ్యకు చెందిన భూమి దున్నేందుకు ప్రయత్నించగా రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పెదమారయ్య కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి. ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.
బురద మడిలో ట్రాక్టర్
తిరగబడి రైతు మృతి
మోత్కూరు : ట్రాక్టర్ తిరగబడి రైతు మృతి చెందాడు. ఈ ఘటన మోత్కూరు మండలం సదర్శాపురం గ్రామంలో శనివారం జరిగింది. సదర్శనాపురం గ్రామానికి చెందిన తుంగపాటి హన్మయ్య, అండాలు దంపతుల చిన్న కుమారుడు యాకరాజు వరి పొలం దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ తిరగబడి కల్టివేటర్ మధ్యలో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సతీష్‌కుమార్ తెలిపారు.


