పోచంపల్లిని సందర్శించిన ట్రైనీ ఏడీఓలు
భూదాన్‌పోచంపల్లి : చేనేత, జౌళిశాఖకు చెందిన 17 మంది ట్రైనీ అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్లు(ఏడీఓ) శనివారం భూదాన్‌పోచంపల్లిలోని చేనేత సహకార సంఘాన్ని సందర్శించారు. అధికారులు, కార్మికులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా చేనేత, జౌళిశాఖ సహాయ సంచాలకులు ఎ. శ్రీనివాసరావు చేనేత సహకార సంఘాల పనితీరు, విధులు, చేనేత కార్మికులకు కల్పిస్తున్న పని, ఉపాధి గురించి వివరించారు. చేనేత కార్మికుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా అమలు చేస్తున్న నేతన్న భరోసా, త్రిఫ్ట్ పథకాలను వివరించారు. అలాగే పోచంపల్లి ఇక్కత్ వస్త్రాల తయారీ విధానాలు, వాటి ప్రత్యేకతలు, అంతర్జాతీయంగా ఉన్న గుర్తింపు, మార్కెటింగ్ విధానాలను వివరించారు. అనంతరం సాయిని భరత్‌కు చెందిన కళాపునర్వి హ్యాండ్లూమ్ యూనిట్‌ను సందర్శించారు. అక్కడ దారం నుంచి వస్త్రం ఎలా తయారవుతుందో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా చేనేత, జౌళిశాఖ ఏడీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఇటీవల గ్రూప్ 2 ద్వారా ఎన్నికై న ఏడీఓలకు హైదరాబాద్‌లోని ఐఐహెచ్‌టీలో రెండు నెలల పాటు చేనేత రంగంపై శిక్షణ తరగతులు జరుగుతున్నాయని అన్నారు. అందులో భాగంగానే క్షేత్రస్థాయి పర్యటన నిమిత్తం పోచంపల్లి సందర్శనకు వచ్చారని తెలిపారు. వారి వెంట జిల్లా చేనేత, జౌళిశాఖ డీఓ రాజేశ్వర్‌రెడ్డి, ఏడీఓ బాలమోహన్‌రెడ్డి, చేనేతసహకార సంఘం డైరెక్టర్లు సూరెపల్లి శ్రీనివాస్, గంజి అంజయ్య, మేనేజర్ రుద్ర అంజనేయులు తదితరులు ఉన్నారు.


