మోటారుకు మరమ్మతులు చేస్తూ..
పెద్దవూర : వ్యవసాయ బావిలో బోరు మోటారుకు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన పెద్దవూర మండలం జయరాంతండాలో గురువారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, తండావాసులు తెలిపిన వివరాల ప్రకారం.. జయరాంతండాకు చెందిన రమావత్ దీప్లా(42) ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం సాయంత్రం అదే తండాకు చెందిన రమావత్ మంగ్తా వ్యవసాయబావి వద్ద బోరు మోటారు పనిచేయకపోవడంతో మరమ్మతులు చేయడానికి దీప్లా వెళ్లాడు. దీప్లా వ్యవసాయ బావిలోకి దిగి బోరు మోటారుకు మరమ్మతులు చేస్తుండగా.. విద్యుదాఘాతానికి గురై బావిలో పడిపోయాడు. బావి పైన ఉన్న మంగ్తా తండావాసులకు సమాచారం అందించాడు. చీకటి పడటంతో బావిలోకి దిగడానికి ఎవరూ సాహసించలేదు. గురువారం తండావాసులు బావిలో నుంచి దీప్లా మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం నాగార్జునసాగర్‌లోని కమలానెహ్రూ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య సైది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ప్రసాద్ తెలిపారు. మృతుడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.


