రోడ్డు ప్రమాదంలో రైతు దుర్మరణం
నార్కట్‌పల్లి : ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రైతు లారీ ఢీకొని మృతిచెందాడు. ఈ ఘటన నార్కట్‌పల్లి మండల పరిధిలోని వివేరా హోటల్ సమీపంలో గురువారం జరిగింది. స్థానిక ఎస్‌ఐ క్రాంతికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల మున్సిపల్ కేంద్రానికి చెందిన ఏశబోయిన గంగులు(70) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వరి నారు కొనేందుకు గురువారం ద్విచక్ర వాహనంపై చిట్యాల నుంచి నార్కట్‌పల్లి మండలంలోని గోపలాయపల్లి గ్రామానికి వచ్చాడు. పని చూసుకుని తిరిగి చిట్యాలకు వెళ్తుండగా.. విజయవాడ–హైదారబాద్ జాతీయ రహదారిపై గల వివేరా హోటల్ సమీపంలో గంగులు ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. దీంతో గంగులు రోడ్డుపై పడిపోగా.. అతడి శరీరం నుజ్జునుజ్జయి అక్కడికక్కడే మృతిచెందాడు. లారీని డ్రైవర్ కొద్దిదూరంలో ఆపి అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


