రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య
భువనగిరి : రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం భువనగిరి పట్టణంలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన పడిగెల మైసయ్య, మంజుల దంపతుల పెద్ద కుమారుడు శివ(26) స్థానికంగా ఓ ప్రైవేట్ చిట్‌ఫండ్‌లో పనిచేస్తూ ఆర్మీ ఉద్యోగం సాధించేందుకు సన్నద్ధమవుతున్నాడు. గురువారం సాయంత్రం పట్టణ శివారులోని పెద్ద చెరువులోకి శామీర్‌పేట నుంచి నీరు వచ్చే రాచకాల్వ వద్ద సికింద్రాబాద్–కాజీపేట రైల్వే మార్గంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలుసుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. మృతుడి వద్ద లభించిన సెల్‌ఫోన్‌లోని స్టేటస్‌లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లు పెట్టుకున్నాడని.. ఆర్థిక ఇబ్బందులతోనే అతడు ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మరే ఇతర కారణాలతోనైనా ఆత్మహత్య చేసుకున్నాడా అనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.


