విద్యుదాఘాతంతో తండ్రి, కుమారుడు మృతి
చివ్వెంల(సూర్యాపేట) : కొత్తగా నిర్మిస్తున్న ఇంటి పిల్లర్లకు వాటర్ ట్యాంకర్‌లో మోటారు వేసి నీళ్లు కొడుతుండగా.. విద్యుదాఘాతానికి గురై తండ్రి మృతిచెందాడు. గమనించిన కుమారుడు తండ్రిని కాపాడేందుకు వెళ్లి ట్యాంకర్‌ను తాకడంతో అతడు కూడా విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఈ ఘటన చివ్వెంల మండల కేంద్రంలో గురువారం రాత్రి జరిగింది. స్థానికులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండల కేంద్రానికి చెందిన మాదాసు బుచ్చయ్య (48) సూర్యాపేటలో వీఆర్‌ఏగా పనిచేస్తున్నాడు. ఇటీవల కొత్త ఇంటి నిర్మాణం చేపట్టాడు. గురువారం క్రిస్మస్ సెలవు కావడంతో ఇంటి వద్ద ఉన్న ఆయన కొత్త ఇంటి పిల్లర్లకు నీటిని కొట్టేందుకు ట్యాంకర్‌ను కిరాయికి తీసుకొచ్చి, అందులో నీరు నింపి అందులో మోటారు వేసి నీరు కొడుతున్నాడు. ట్యాంకర్‌తో పాటు అందులో ఉన్న మోటారుకు విద్యుత్ సరఫరా జరగడంతో బుచ్చయ్య ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై కుప్పకూలిపోయాడు. అదే సమయంలో అక్కడకు వచ్చిన అతడి చిన్న కుమారురుడు మాదాసు లోకేష్(22) తండ్రి కిందపడి ఉన్న విషయాన్ని గమనించాడు. అతడి దగ్గరకు వెళ్లే క్రమంలో ట్యాంకర్‌కు విద్యుత్ సరఫరా జరుగుతున్న విషయాన్ని గమనించకుండా దానిని పట్టుకున్నాడు. దీంతో అతడు కూడా విద్యుదాఘాతానికి గురై అక్కడే పడిపోయాడు. స్థానికులు గమనించి తండ్రి, కుమారుడిని సూర్యాపేటలోనిజనరల్ హాస్పిటల్‌కు తరలించగా.. అప్పటికే వారిద్దరు మృతి చెందినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు.
ఫ కొత్తగా నిర్మిస్తున్న ఇంటి పిల్లర్లకు
నీళ్లు కొడుతుండగా ఘటన
విద్యుదాఘాతంతో తండ్రి, కుమారుడు మృతి


