షార్ట్ సర్క్యూట్‌తో ఇంట్లో సామగ్రి దగ్ధం
శాలిగౌరారం : విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇంట్లో సామగ్రి దగ్ధమైంది. ఈ ఘటన శాలిగౌరారం మండలం ఆకారంలో గురువారం జరిగింది. ఆకారం గ్రామానికి చెందిన ఇంద్రకంటి యాదగిరి వ్యవసాయం చేస్తుండగా.. అతడి భార్య శ్రీకన్య ఐకేపీలో విలేజ్ బుక్ కీపర్‌గా పనిచేస్తోంది. క్రిస్మస్ సందర్భంగా గురువారం ప్రార్ధన చేసేందుకు యాదగిరి కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక చర్చికి వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి ఇంట్లో నుంచి పొగలు వస్తుండటంతో వెంటనే తలుపులు తీసి చూడగా.. ఇంట్లో ఉన్న విద్యుత్ స్విచ్ బోర్డు కాలిపోయి పక్కనే ఉన్న కూలర్, ప్లాస్టిక్ టేబుల్‌తో పాటు టేబుల్‌పై ఉన్న సమభావనా సంఘాలకు సంబంధించిన రికార్డులు పూర్తిగా కాలిబూడిదయ్యాయి. వెంటనే నీళ్లు చల్లి మంటలను ఆర్పివేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ప్రమాద స్థలాన్ని పరిశీలించి పంచనామా నిర్వహించారు.


