
వాగులో కొట్టుకుపోయి వ్యక్తి మృతి
గుండాల: ప్రమాదవశాత్తు వాగులో కొట్టుకుపోయి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన గుండాల మండలం అంబాల గ్రామ శివారులో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం రామచంద్రగూడెం గ్రామానికి చెందిన చిర్ర బాలరాజు(55) కొంతకాలంగా హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్‌లో ఉంటూ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడి భార్య గతంలోనే మృతిచెందింది. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. బాలరాజు తన అత్తగారి ఊరైన ఆత్మకూరు(ఎం) మండలం పారుపల్లి గ్రామంలో మైసమ్మ పండుగకు హాజరయ్యేందుకు ఆదివారం హైదరాబాద్ నుంచి బస్సులో బయల్దేరి మోత్కూరులో దిగాడు. అక్కడి నుంచి పారుపల్లి గ్రామంలోని తన అత్తగారి వ్యవసాయ బావి వద్దకు వెళ్లేందుకు ఆత్మకూరు(ఎం) మండలం మోదుబావిగూడెం, గుండాల మండలం అంబాల గ్రామ శివారులోని బిక్కేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యాంపై నడుచుకుంటూ వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు వాగులో జారిపడి కొట్టుకుపోయాడు. మంగళవారం అంబాల గ్రామ శివారులో బిక్కేరు వాగు ఒడ్డున బాలరాజు మృతదేహాన్ని స్థానిక రైతులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి కుమారుడు నర్సింహ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆలేరు ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తేజమ్‌రెడ్డి తెలిపారు.
కుక్కల దాడిలో
ఇద్దరికి గాయాలు
నాగారం: కుక్కల దాడిలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. ఈ ఘటన నాగారం మండలం ఫణిగిరి గ్రామంలో మంగళవారం జరిగింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫణిగిరి గ్రామానికి చెందిన షేక్ షఫీ స్థానిక మేరి మదర్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. అదే పాఠశాలలో తుంగతుర్తికి చెందిన జటంగి సతీష్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. మంగళవారం అటెండర్ షఫీ పాఠశాల వెనుక ఉన్న గదిలోకి వెళ్లగా.. అక్కడ కుక్కలు ఉండడంతో వాటిని వెళ్లగొట్టేందుకు ప్రయత్నించాడు. దీంతో ఒక్కసారిగా కుక్కలు అతడిపై దాడి చేసి తొడ భాగంలో కరిచాయి. అతడు కేకలు వేయగా సమీపంలో ఉన్న ఉపాధ్యాయుడు సతీష్ వచ్చి షఫీని విడిపించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కుక్కలు సతీష్‌పై కూడా దాడి చేసి ఛాతి భాగంలో గాయపరిచాయి. గ్రామంలో కుక్కలు ఎక్కువగా ఉన్నాయని, అధికారులు స్పందించి వాటిని ఊరికి దూరంగా తరిమేయాలని స్థానికులు కోరుతున్నారు.