
ప్రశ్నిస్తే మాపైనే కేసులు పెడతారా?
మోటకొండూర్: ఇసుక అక్రమ రవాణాను అరికట్టడంలో అధికారులు విఫలం అయ్యారని తేర్యాల గ్రామ రైతులు ఆరోపించారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుని, ప్రశ్నించిన తమపైనే పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ సోమవారం మోటకొండూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అక్రమార్కులు ఇసుక దందా చేస్తున్నారని ఆరోపించారు. గ్రామ పరిధినుంచి వెళ్తున్న వాగును ఏళ్ల కాలంగా కాపాడుకుంటున్నామని, ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కోసం అధికారులు పర్మిషన్ ఇవ్వగా ఇదే అదనుగా లూటీ చేస్తున్నారని వాపోయారు. పరిమితికి మించి ట్రాక్టర్ల ద్వారా బ్లాక్ మార్కెట్‌కు ఇసుక తరలిస్తున్నారని పేర్కొన్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను అడ్డుకున్న రైతులపైనే కేసులు పెట్టి, బైండోవర్ చేయటాన్ని వారు ఖండించారు. తమపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని.. ట్రాక్టర్ యజమానులపై కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ నాగదివ్యకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు బాలగాని రాజుగౌడ్, మంత్రి ప్రభాకర్, బొంగు కృష్ణమూర్తి, నల్ల భాషా, నల్ల ఎల్లస్వామి, నల్ల నర్సింహ, కడకంటి నాగాచారి, మరాఠి శ్రీను, బూరెడ్డి సుధాకర్‌రెడ్డి, బిక్షం, బొట్ల రాంచంద్రు తదితరులు పాల్గొన్నారు.
ఫ తేర్యాల గ్రామ రైతుల ధర్నా