
విస్తరిస్తున్న ఆయిల్‌పామ్
15 ఎకరాల్లో సాగు చేశా..
కోతకు వచ్చింది
జిల్లాలో 6,400 ఎకరాల్లో సాగు.. 700 ఎకరాలకు రిజిస్ట్రేషన్
ఆత్మకూరు(ఎం): జిల్లా వ్యాప్తంగా ఆయిల్‌పామ్ విస్తరిస్తోంది. ప్రస్తుతం 6,400 ఎకరాల్లో సాగవుతుండగా.. మరో 700 ఎకరాలకు రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కాగా మూడేళ్ల కిత్రం మొదటి దశలో నాటిన మొక్కలు నేడు ఫలాలనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. గెలలు కోసి మార్కెట్‌కు తరలించేందుకు రైతులు రెడీ అవుతున్నారు. శ్రమ, పెట్టుబడి తక్కువ, మంచి లాభాలు, ఒక్కసారి నాటితే మూడేళ్ల నుంచి 30 ఏళ్ల వరకు దిగుబడి, ప్రభుత్వం అందజేస్తున్న రాయితీలతో ఆయిల్‌పామ్ సాగుపై రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు.
2022–23లో ఆయిల్‌పామ్ సాగు ప్రారంభం
యాదాద్రి భువనగిరి జిల్లాలో 2022–23లో అయిల్‌పామ్ సాగు ప్రారంభించారు. మొదటి విడతలో 1,400 ఎకరాలు లక్ష్యం కాగా.. 285 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకొని పూర్తిస్థాయిలో మొక్కలు నాటారు. 2023–25 ఆర్థిక సంవత్సరంలో 4,500 ఎకరాలకు గాను పూర్తిస్థాయిలో లక్ష్యం చేరారు. 2025–26లో 3 వేల ఎకరాలు ఆయిల్‌పామ్ సాగు చేయాలన్నది ఆయిల్‌ఫెడ్ సంస్థ లక్ష్యం కాగా.. అందులో ఇప్పటి వరకు 500 ఎకరాల్లో ప్లాంటేషన్ పూర్తయ్యింది. మరో 700 ఎకరాల్లో మొక్కలు నాటేందుకు రైతులు రిజిష్ట్రేషన్ చేసుకున్నారు. మార్చి 31 వరకు టార్గెట్ పూర్తి చేయడానికి అధికారులు, ఫీల్డ్ సిబ్బంది క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు.
వలిగొండ, చౌటుప్పల్,
తుర్కపల్లిలో కలెక్షన్ సెంటర్లు
మొదటి దశలో నాటిన మొక్కలు నేడు ఫలాలనివ్వబోతున్నాయి. ప్రస్తుతం 170 ఎకరాల్లో తోటలు కోతకు వచ్చాయి. మరో వెయ్యి ఎకరాలు కోతకు రానున్నాయి. జిల్లాలో వలిగొండ, చౌటుప్పల్, తుర్కపల్లిలో కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఆయిల్‌పామ్ చేతికొచ్చిన రైతులు కలెక్షన్ సెంటర్లకు లేదా నేరుగా నూనె కర్మాగారాలకు గెలలను తరలించి మార్కెట్ చేసుకోవచ్చు. సిద్ధిపేట జిల్లా నంగనూరు మండలం నర్మెట వద్ద దేశంలోనే అతిపెద్ద నూనె కర్మాగారం నిర్మిస్తున్నారు. దసరా నాటికి అందుబాటులోకి వస్తుందని అధికారులు అంటున్నారు. ఇది అందుబాటులోకి వస్తే జిల్లా రైతులకు మేలు చేకూరుతుంది.
ఫలితాలివ్వబోతున్న
మొదటి విడత మొక్కలు
170 ఎకరాల్లో కోతకు సిద్ధం
మార్కెటింగ్ సౌలభ్యం కోసం
మూడు కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు
ఆయిల్‌పామ్ సాగు (ఎకరాల్లో)
సంవత్సరం లక్ష్యం సాగు
2023–24 1,400 1,400
2024–25 4,500 4,500
2025–26 3,400 500
ఖమ్మం జిల్లా అశ్వారావుపేటకు వెళ్లి స్వయంగా ఆయిల్‌పామ్ సాగుపై అధ్యయనం చేశా. కోతుల బెడద, దళారుల సమస్య ఉండదు. ఆదాయం కూడా మంచిగానే ఉందనిపించింది. ఒక ఎకరం నీటితో నాలుగు ఎకరాల అయిల్‌పామ్ సాగు చేయొచ్చు. అందుకే గ్రామంలో 15 ఎకరాల్లో అయిల్‌పామ్ సాగు చేస్తున్నా. ఈ సంవత్సరమే మొక్కలు నాటాను.
– మందడి శ్రీనివాస్‌రెడ్డి, కూరెళ్ల, ఆత్మకూరు(ఎం)
2022లో పది ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేశా. అప్పటి అయిల్‌ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి దగ్గరుండి మొక్కలు నాటించారు. అంతరపంటగా వక్క తోట సాగు చేశా. ఇటీవల పామాయిల్ కోతకు వచ్చింది. మా ఏరియాకు వలిగొండ సెంటర్ కేటాయించారు. గెలలు కోయగానే వలిగొండకు తీసుకెళ్తా. –మల్లెపూల ఉపేందర్,
మోదుగుకుంట, ఆత్మకూరు(ఎం) మండలం

విస్తరిస్తున్న ఆయిల్‌పామ్

విస్తరిస్తున్న ఆయిల్‌పామ్

విస్తరిస్తున్న ఆయిల్‌పామ్