
పండ్ల రారాజుకు సెలవు
నూతనకల్: నూతనకల్ మండలం ఎర్రపహాడ్ గ్రామానికి చెందిన, పండ్ల రారాజుగా పేరుగాంచిన దేశ్‌ముఖ్ జెన్నారెడ్డి శ్యాంసుందర్‌రెడ్డి అంత్యక్రియలు శనివారం స్వగ్రామంలో పూర్తయ్యాయి. శ్యాంసుందర్‌రెడ్డి తండ్రి జెన్నారెడ్డి ప్రతాప్‌రెడ్డి నిజాం కాలంలో దేశ్‌ముఖ్‌గా పనిచేశారు. ప్రతాప్‌రెడ్డికి ఐదుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు సంతానం కాగా.. పెద్ద కుమారుడైన శ్యాంసుందర్‌రెడ్డి అగ్రికల్చర్ డిప్లొమా పూర్తిచేసి తనకు ఉన్న 800 ఎకరాల్లో మామిడి, బత్తాయి, సపోట వంటి పండ్ల తోటలు సాగుచేసి భారతదేశంతో పాటు ఆసియా దేశాలకు సైతం పండ్లు సరఫరా చేసి భారత ప్రభుత్వంచే పండ్ల రారాజుగా అవార్డు అందుకున్నారు. ఓపెన్ చానల్ ద్వారా నీటి సరఫరా చేసి వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. రాజకీయంగా ఎంతో మందికి అండదండలు అందించి ఉన్నత పదవుల్లో నిలిచేలా కృషిచేశారు. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. విద్యావ్యాప్తిలో భాగంగా హైదరాబాద్‌లో చైతన్య భారతి ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా సీబీఐటీ, ఎంజీఐటీ ఇంజనీరింగ్ కళాశాలలను స్థాపనలో పాలుపుంచుకుని ఎంతో మంది పేద విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించే విధంగా కృషిచేశారు. శ్యాంసుందర్‌రెడ్డి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డికి స్వయాన బావ. శ్యాంసుందర్‌రెడ్డి భౌతికకాయానికి మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, రైతు కమిషన్ సభ్యుడు రాంరెడ్డి గోపాల్‌రెడ్డి, మహబూబాబాద్, సూర్యాపేట డీసీసీ అధ్యక్షులు జెన్నారెడ్డి భరత్‌సింహారెడ్డి, చెవిటి వెంకన్నయాదవ్, సూర్యాపేట, తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్‌లు కొప్పుల వేణారెడ్డి, తీగల గిరిధర్‌రెడ్డి, గుడిపాటి నర్సయ్య, తిరుమలప్రగడ అనురాధ, పోతు భాస్కర్, నాగం సుధాకర్‌రెడ్డి, గుంటకండ్ల చంద్రారెడ్డి తదితరులు నివాళులర్పించారు.
ఫ ముగిసిన శ్యాంసుందర్‌రెడ్డి అంత్యక్రియలు
ఫ నివాళులర్పించిన ప్రముఖులు

పండ్ల రారాజుకు సెలవు