
తల్లి మందలించిందని యువకుడి ఆత్మహత్య
గుర్రంపోడు: తల్లి మందలించిందని మనస్తాపానికి గురైన యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శనివారం గుర్రంపోడు మండలం మొసంగి గ్రామంలో జరిగింది. ఎస్‌ఐ పసుపులేటి మధు తెలిపిన వివరాల ప్రకారం.. మొసంగి గ్రామానికి చెందిన బొంగరాల శ్రీధర్(21) ఏ పని చేయకుండా ఖాళీగా తిరుగుతుండడంతో అతడి తల్లి వెంకటమ్మ మందలించింది. దీంతో మనస్తాపం చెందిన శ్రీధర్ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి లింగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
రైలు కింద పడి..
తిప్పర్తి: రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తిప్పర్తి మండలం రాయినిగూడెం గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి జరిగింది. రైల్వే ఎస్‌ఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 50 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి శుక్రవారం రాత్రి రాయినిగూడెం గ్రామ సమీపంలో చైన్నై ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుడికాలు తొలగించబడి ఉన్నట్లు రైల్వే తెలిపారు. ఘటనా స్థలంలో ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. నల్లగొండ స్టేషన్ మాస్టర్ నవీన్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్‌ఐ తెలిపారు.
యువకుడి అదృశ్యం
చౌటుప్పల్: ఆఫీస్‌కి వెళ్లిన యువకుడు ఇంటికి తిరిగిరాకుండా అదృశ్యమయ్యాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. శనివారం చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా మాచవరం మండలం మోర్జంపాడు గ్రామానికి చెందిన గడిపూడి మురారి(30) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి మూడేళ్ల క్రితం వివాహం అయ్యింది. మూడు నెలల క్రితం భార్యాభర్తల మధ్య గొడవ జరిగడంతో మురారి భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మురారి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని విద్యానగర్‌కాలనీలో నివాసముంటున్న తన అక్క కాంచన వద్దకు వచ్చాడు. ఇక్కడే ఉంటూ రోజూ హైదరాబాద్‌లో ఆఫీస్‌కి వెళ్లి తిరిగి రాత్రికి వస్తుండేవాడు. రోజుమాదిరిగానే ఈ నెల 18న ఉదయం మురారి ఆఫీస్‌కి వెళ్లాడు. అదేరోజు రాత్రి అతడికి తన అక్క ఫోన్ చేయగా.. ఇంటికి వస్తున్నా అని చెప్పాడు. కానీ వెళ్లలేదు. ఆ తర్వాత రెండు రోజులు అతడి ఫోన్ ఆన్‌లో ఉన్నప్పటికీ.. ఫోన్ చేసినా సమాధానం ఇవ్వలేదు. తన తమ్ముడు హైదరాబాద్‌లో ఏదైనా పనిమీద ఉన్నాడేమోనని భావించిన కాంచన అంతగా పట్టించుకోలేదు. 21వ తేదీ నుంచి మురారి సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ అయిపోయింది. దీంతో శనివారం అతడి అక్క కాంచన చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.