
ఎస్‌ఆర్ ల్యాబొరేటరీస్‌లో అగ్ని ప్రమాదం
చౌటుప్పల్ రూరల్: చౌటుప్పల్ మండలంలోని జైకేసారం గ్రామ పరిధిలోని ఎస్‌ఆర్ ల్యాబొరేటరీస్ పరిశ్రమలో శనివారం రాత్రి 9గంటల సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక సమాచారం. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్‌ఆర్ ల్యాబొరేటరీస్ కెమికల్ పరిశ్రమలో శనివారం రాత్రి 9గంటలకు కార్మికులు డ్యూటీ షిఫ్ట్ మారే సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా చిన్నగా మంటలు మొదలయ్యాయి. ఆ సమయంలో డ్యూటీలో ఆరుగురు కార్మికులు ఉన్నట్లు తెలిసింది. మంటలను గమనించిన కార్మికులు భయంతో పరిశ్రమ బయటకు పరుగులు తీశారు. కార్మికులు డయల్ 100కి ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. చౌటుప్పల్ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ మంటల్లో రియాక్టర్లు పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
భయాందోళనలో జైకేసారం గ్రామస్తులు..
గ్రామ పరిధిలోని ఎస్‌ఆర్ ల్యాబొరేటరీస్ కెమికల్ పరిశ్రమలో అగ్నిప్రమాదం జరగడంతో జైకేసారం గ్రామ ప్రజలు ఉలిక్కిపడ్డారు. గ్రామానికి సమీపంలో పరిశ్రమ ఉండడంతో మంటల్లో రియాక్టర్లు పేలి దాని తీవ్రత ఎంతగా ఉంటుందోనని భయాందోళనకు గురయ్యారు. సమాయానికి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇదే కంపెనీలో గతంలో కూడా అగ్ని ప్రమాదం జరిగి కార్మికులు గాయపడిన ఉదంతాలు ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు.
షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం
జరిగిందని ప్రాథమిక సమాచారం
మంటలను అదుపు చేసిన
అగ్నిమాపక సిబ్బంది