
హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్
చివ్వెంల(సూర్యాపేట): భర్తతో పాటు అతడి ఇద్దరి భార్యలపై హత్యాయత్నం చేసిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ శనివారం చివ్వెంల పోలీస్ స్టేషన్‌లో విలేకరులకు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండలం అక్కలదేవిగూడెం గ్రామానికి చెందిన దండుగుల లక్ష్మయ్య మొదటి భార్యతో కుడకుడ గ్రామానికి చెందిన దండుగుల శేఖర్ వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో.. గతంలో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగగా.. పెద్దమనుషుల మధ్య పంచాయితీ పెట్టి సమస్యను పరిష్కరించుకున్నారు. కేసులు పెట్టుకుని రాజీపడ్డారు. కానీ శేఖర్ మాత్రం లక్ష్మయ్య, అతడి మొదటి భార్యపై పగ పెంచుకున్నాడు. సూర్యాపేటలోని సుందరయ్య నగర్‌కు చెందిన శేఖర్ స్నేహితుడు పల్లపు గోపి ఇంటి నిర్మాణానికి లక్ష్మయ్య వద్ద రాయి కొనుగోలు చేశాడు. రాయికి సంబంధించిన డబ్బులు ఇవ్వాలని లక్ష్మయ్య గోపిని విసిగిస్తుండడంతో.. శేఖర్, గోపితో పాటు వారి స్నేహితులైన టేకుమట్ల గ్రామానికి చెందిన పల్లపు రాము, రాయినిగూడెం గ్రామానికి చెందిన పసుపుల చంటి కలిసి శుక్రవారం చివ్వెంల పోలీస్ స్టేషన్‌కు బైక్‌పై వెళ్తున్న అక్ష్మయ్య, అతడి ఇద్దరి భార్యలను కారులో వెంబడించి వారిపై దాడి చేశారు. ప్రాణాలు కాపాడుకునేందుకు లక్ష్మయ్య, అతడి భార్యలు బీబీగూడెం గ్రామ శివారులోని మధుర వైన్స్‌లో వెళ్లి దాచుకున్నారు. దీంతో శేఖర్, గోపితో పాటు వారి స్నేహితులు అక్కడ నుంచి పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వి. మహేశ్వర్ కేసు నమోదు చేసి శనివారం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.