
మనస్తాపంతో యువకుడి బలవన్మరణం
మోతె: బంధువు సూటిపోటి మాటలతో మనస్తాపం చెందిన యువకుడు గడ్డిమందు తాగగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. వివరాలు.. మోతె మండలం విభళాపురం గ్రామానికి చెందిన నిమ్మల పెదలచ్చయ్య, లచ్చమ్మ దంపతులకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానం. అందరికీ వివాహాలు చేశారు. నలుగురు కుమారులకు ఒక్కొక్కరికి ఆరెకరాల వ్యవసాయ భూమి, 3 గుంటల ఇంటి స్థలం పంచి ఇచ్చారు. వృద్ధాప్యంలో ఉన్న తమకు కుమారులు పట్టించుకోవడం లేదని పెదలచ్చయ్య, లచ్చమ్మ దంపతులు పలుమార్లు తహసీల్దార్, ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో సోమవారం ఆ వృద్ధ దంపతులు తమ మనమడు నిమ్మల రాము(22)తో కలిసి సూర్యాపేట కలెక్టరేట్‌లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. వారి బంధువు నిమ్మల రాజశేఖర్ సూటిపోటి మాటలు అనడంతో మనస్తాపానికి గురైన రాము మంగళవారం గడ్డి మందు తాగాడు. కుటుంబ సభ్యులు సూర్యాపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. మృతుడి తండ్రి శ్రీను ఫిర్యాదు మేరకు నిమ్మల రాజశేఖర్, వృద్ధ దంపతులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ అజయ్‌కుమార్ తెలిపారు.