
అత్తింటి వేధింపులతో వివాహిత ఆత్మహత్య
మరిపెడ రూరల్: అత్తింటి వేధింపులతో వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేటలో బుధవారం చోటు చేసుకోగా ఆలస్యంగా గురువారం వెలుగుచూసింది. స్థానికులు, బంధువుల కథనం ప్రకారం.. ఎల్లంపేట గ్రామానికి చెందిన పాక వెంకన్న, ఉమ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. చిన్న కుమార్తె ప్రత్యూషను(24) ఐదేళ్ల క్రితం సూర్యాపేట జిల్లా మోతె మండలం జగ్గుగూడెం గ్రామానికి చెందిన పెరుగు పరశురాములుకు ఇచ్చి వివాహం చేశారు. కట్నకానుకల కింద ఇద్దరు కుమార్తెలకు చెరో ఒకరం వ్యవసాయ భూమి రాసి ఇచ్చారు. ప్రత్యూష, పరశురాములు దంపతుల దాంపత్య జీవితం కొంతకాలం సజావుగా కొనసాగింది. ఈ క్రమంలో ప్రత్యూష అత్తగారి ఇంటి వద్ద మరిది పెత్తనంతో ఆ ఉమ్మడి కుటుంబంలో గొడవలు చోటు చేసుకున్నాయి. ఆ గొడవలు పెద్దగా మారి ప్రత్యూషను కట్నం కింద ఇచ్చిన భూమి అమ్మి డబ్బులు తీసుకురావాలని అత్తింటివారు వేధించడం మొదలుపెట్టారు. ఈ విషయంలో ఇటీవల అత్తమామ, మరిది, భర్త కలిసి ప్రత్యూషపై దాడి చేశారు. అనంతరం ప్రత్యూషను భర్త పరశురాములు పది రోజుల క్రితం తల్లిగారి ఊరైన ఎల్లంపేటలో బలవంతంగా వదిలి వెళ్లాడు. ఎంతకూ తీసుకెళ్లకపోవడంతో ప్రత్యూష ఫోన్‌లో భర్తను నిలదీసింది. దీంతో శ్రీనాకు, నీకు సంబంధం లేదు.. నీ చావు నువ్వు చావుశ్రీ అని భర్త తెగేసి చెప్పాడు. మనస్తాపానికి గురైన ప్రత్యూష ఈ నెల 19న ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి యత్నంచగా పక్కంటి వారు చూసి రక్షించే ప్రయత్నం చేశారు. కొన ఊపిరితో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు 108 వాహనంలో ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఈ నెల 20న మృతిచెందింది. మృతురాలి తండ్రి వెంకన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. మృతురాలికి 11 నెలల కుమార్తె ఉంది.