
వాగొస్తే దిగ్బంధమే
ఆత్మకూరు(ఎం): జిల్లాలో బిక్కేరు వాగు గుండాల, మోత్కూరు, ఆత్మకూరు, అడ్డగూడూరు మండలాల పరిధిలో ప్రవహిస్తుంది. ఎగువన భారీ వర్షాలు కురిసినా, స్థానికంగా వర్షం కురిసినా వాగుకు వరద ఉధృతి పెరుగుతుంది. ఈ సమయంలో వాగుకు ఇరువైపులా ఉన్న గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. వరద తగ్గేదాకా రాకపోకలు నిలిచిపోతున్నాయి. అయితే బిక్కేరు వాగు ప్రారంభం నుంచి ముగింపు వరకు ఎక్కువగా ఆత్మకూరు(ఎం) మండల పరిధి గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామస్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని చాడ– చందెపల్లి, కొరటికల్– ఆత్మకూరు(ఎం), మొరిపిరాల– ఆత్మకూరు(ఎం), పోతిరెడ్డిపల్లి– రహీంఖాన్‌పేట గ్రామాల మధ్య లోలేవల్ కాజ్‌వేలు నిర్మించారు. సుమారు వాటిని నిర్మించి 35 సంవత్సరాలు కావస్తుండటంతో ప్రస్తుతం అస్తవ్యస్తంగా మారాయి. వాటి ఎత్తు పెంచి నూతన కాజ్‌వేలను నిర్మించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
ఇబ్బందులు పడుతున్న గ్రామాలు ఇవీ..
బిక్కేరు వాగు ప్రవహించినప్పుడల్లా ఎక్కువగా ఉమ్మడి ఆత్మకూరు(ఎం) మండలంలోని చందెపల్లి, చాడ, కొండాపురం, ఆత్మకూరు(ఎం)మండలంలోని మొరిపిరాల, కాల్వపల్లి, సింగారం, చిన్నగూడెం, కొరటికల్, ఇప్పల్ల, పల్లెపహాడ్, పోతిరెడ్డిపల్లి, రహీంఖాన్‌పేట, మోదుబావిగూడెం, ఉప్పలపహాడ్ గ్రామాల ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వాగు అవతల, ఇవతల వ్యవసాయ భూములు, మండల కేంద్రంలో వ్యాపారాలు నిర్వహించే వారు ఉండటంతో వారికి తిప్పలు తప్పడం లేదు.
మాది పోతిరెడ్డిపల్లి, మా ఊరుకు పక్కనే బిక్కేరు వాగు ఉంటుంది. వాగు పక్కనే వ్యవసాయ భూమి, పౌల్ట్రీ ఫారం ఉంటుంది. అంతా అరకిలో మీటరు దూరంలోనే ఉంటాయి. బిక్కేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పారుపల్లి మీదుగా సుమారు 18కిలో మీటర్ల దూరం తిరిగి రావాల్సి వచ్చింది. లోలేవల్ కాజ్‌వే స్థానంలో కొత్తగా బ్రిడ్జి నిర్మిస్తే ఈ సమస్య ఉండదు.
– జక్క స్కైలాబ్‌రెడ్డి, రైతు, పోతిరెడ్డిపల్లి
ఫ ఆత్మకూరు మండలంలో లోలెవల్ కాజ్‌వేలు నిర్మించి 35ఏళ్లు
ఫ బిక్కేరు వాగు ఉప్పొంగిన ప్రతిసారి రాకపోకలు బంద్
ఫ కాజ్‌వేల ఎత్తు పెంచితే తీరనున్న సమస్య

వాగొస్తే దిగ్బంధమే