
రాగి జావ.. మళ్లీ ఇస్తారా?
ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో రాగి జావ పంపిణీకి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు. రాగి జావ తయారీకి సంబంధించి రాగి పిండి, బెల్లం సామగ్రి రాలేదు. దీంతో విద్యార్థులకు రాగి జావ అందించడం లేదు. ప్రభుత్వం సరఫరా చేస్తే విద్యార్థులకు అందజేస్తాం.
– సత్యనారాయణ, డీఈఓ
భువనగిరి: ప్రభుత్వ పాఠశాలల్లో ఽవిద్యార్థులకు మధ్యాహ్న భోజనంతోపాటు మరింత పోషకాహారాన్ని అందించేందుకు గతేడాది ప్రభుత్వం రాగి జావ పంపిణీకి శ్రీకారం చుట్టింది. 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు పీఎం పోషణ్ కింద రాగి జావ పంపిణీ చేశారు. గత విద్యా సంవత్సరం ముగింపు వరకు విద్యార్థులకు రాగి జావ అందజేశారు. కానీ ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడస్తున్నా ఇప్పటివరకు ప్రారంభించలేదు. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం నుంచి రాగి, పిండి, బెల్లం ప్యాకెట్లు ఇంకా సర్కారు బడులకు సరఫరా కాలేదని తెలుస్తోంది.
జిల్లాలో 43,488 మంది విద్యార్థులు
జిల్లాలోని 17 మండలాల పరిధిలోని 715 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం 43,488 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. గతేడాది పంపిణీ చేసిన మాదిరిగా ఈ విద్యా సంవత్సరం ఇప్పటివరకు రాగి జావ పంపిణీ చేయలేదు. మధ్యాహ్నం భోజనంలో భాగంగా వారంలో గుడ్డు అందించని మిగతా మూడు రోజుల్లో ప్రతి విద్యార్థికి రాగిజావ అందించడంతో విద్యార్థులకు పోషకాహారం లభించడంతో పాటు చురుకుగా ఉంటారని ప్రభుత్వం భావించి గతేడాది పంపిణీకి చర్యలు తీసుకుంది. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది రాగి జావ పంపిణీ చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.
ఫ ఈ ఏడాది అమలుకు
నోచుకోని పంపిణీ ప్రక్రియ
ఫ పాఠశాలలకు చేరని రాగి పిండి,
బెల్లం ప్యాకెట్లు