
కేబుల్ వైర్లు కట్ చేయాల్సిందే
కోదాడ: విద్యుత్ స్తంభాలకు అస్తవ్యస్తంగా ఏర్పాటు చేస్తున్న కేబుల్ వైర్లతో నిత్యం ప్రమాదాలు జరుగుతుండడంతో ప్రభుత్వం, విద్యుత్‌శాఖ అధికారులు తీవ్రంగా స్పందించారు. కేబుల్ వైర్లను విద్యుత్ స్తంభాలకు క్రమపద్ధతిలో అమర్చుకోవాలని విద్యుత్‌శాఖ చెబుతున్నా ఇప్పటివరకు పెడచెవిన పెట్టిన కేబుల్ ఆపరేటర్లకు ఆ శాఖ షాక్ ఇచ్చింది. హైదరాబాద్‌లోని రామాంతపూర్‌లో రెండు రోజుల క్రితం కేబుల్ వైర్ల వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి ఐదుగురు చనిపోవడంతో ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ క్రమంలో మున్సిపాలిటీల్లో స్తంభాలకు వేలాడదీసిన కేబుల్ వైర్లను ముందస్తు సమాచారం ఇవ్వకుండా తొలగించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇవ్వడంతో స్థానిక సిబ్బంది రెండు మూడు రోజుల్లో కత్తిరించి వేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.
అవగాహన లోపంతోనే తిప్పలు
మున్సిపాలిటీల్లో కేబుల్ కనెక్షన్లతో పాటు ఇంటర్నెట్ కేబుల్స్‌ను విద్యుత్ స్తంభాలకు వేలాడదీస్తుంటారు. పదుల సంఖ్యలో ఉన్న ఆపరేటర్లు ఇష్టారీతిన వీటిని స్తంభాలకు వేలాడదీస్తుండడంతో సమస్య వచ్చినపుడు స్తంభం ఎక్కడానికి తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుందని విద్యుత్ సిబ్బంది చెబుతున్నా ఆపరేటర్లు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. దీనికి తోడు తక్కువ ఎత్తులో తీగలను వేలాడదీస్తుండడంతో భారీ వాహనాలకు తగిలి తరచూ ఇవి తెగిపడడం, కిందకు జారడంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు ప్రమాదాలకు గురవుతున్నారు. కట్టలుగా కేబుల్ వైర్లను స్తంభాలకు కడుతుండడంతో షార్ట్ సర్క్యూట్స్ సర్వసాధారణంగా మారాయి.
కట్ చేస్తే ఇబ్బందే..
విద్యుత్‌శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన కేబుల్ వైర్లను కట్ చేస్తే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని పలువురు అంటున్నారు. సాధారణ టీవీ కేబుల్స్‌తో పాటు ఇంటర్‌నెట్ కేబుల్స్ కూడా విద్యుత్ స్తంభాలకు ఉన్నాయి. వీటిని కట్ చేస్తే పలువురికి ఇంటర్నెట్ సౌకర్యం లేకుండా పోతుంది. వర్క్ ఫ్రం హోం ద్వారా పనిచేసే ఐటీ ఉద్యోగులతో పాటు విద్యార్ధులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని విద్యుత్‌శాఖ అధికారులు ముందస్తుగా ఆపరేటర్లతో సమావేశం ఏర్పాటు చేసి అస్తవ్యస్తంగా ఉన్న కేబుల్ వైర్లను సరిచేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని పలువురు కోరుతున్నారు.
ఫ విద్యుత్ స్తంభాలకు ఉన్న కేబుల్ వైర్లు తొలగించాలని ప్రభుత్వం ఆదేశం
ఫ క్రమపద్ధతిలో అమర్చుకోవడంలో
ఆపరేటర్లు విఫలం