
తాళం వేసిన ఇంట్లో చోరీ
కొండమల్లేపల్లి: తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన కొండమల్లేపల్లి మండలం కొర్రతండాలో సోమవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొర్రతండాకు చెందిన కొర్ర పట్టి గ్రామంలో కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టింది. ఆమె భర్త ధన్య గతంలోనే మృతిచెందాడు. కొత్తగా నిర్మిస్తున్న ఇంటి పక్కనే జహిందర్ ఇంట్లో పట్టి అద్దెకు ఉంటోంది. సోమవారం రాత్రి ఆమె అద్దెకు ఉంటున్న ఇంటికి తాళం వేసి కొత్తగా నిర్మిస్తున్న ఇంట్లోకి వెళ్లి నిద్రించింది. మంగళవారం ఉదయం అద్దె ఇంటికి వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉండటంతో లోపలికి వెళ్లి చూడగా.. బీరువాలోని కేజీ వెండి, రూ.1.50లక్షల నగదు చోరీకి గురైనట్లు గుర్తించింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
యాదగిరీశుడి హుండీ ఆదాయం రూ.2.35కోట్లు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని హుండీల్లో భక్తులు సమర్పించుకున్న నగదు, కానుకలను మంగళవారం కొండకు దిగువన ఉన్న శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపంలో ఈఓ వెంకట్రావ్, ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి ఆధ్వర్యంలో ఉద్యోగులు, సిబ్బంది లెక్కించారు. మొత్తం రూ.2,35, 32,627 నగదు వచ్చినట్లు ఈఓ వెల్లడించారు. మిశ్రమ బంగారం 76 గ్రాములు, మిశ్రమ వెండి 9కిలోల 475గ్రాములు వచ్చినట్లు పేర్కొన్నారు. వీటితో పాటు వివిధ దేశాల కరెన్సీలు సైతం హుండీల్లో వచ్చాయని ఈఓ తెలిపారు. హుండీ ఆదాయం 27 రోజులదని వెల్లడించారు.