
సాగర్‌కు పోటెత్తిన వరద.. ఆగిన లాంచీలు
నాగార్జునసాగర్: ఎగువన గల శ్రీశైలం జలాశయం నుంచి వచ్చే వరద భారీస్థాయిలో పెరగడంతో పాటు గాలి వీస్తుండటంతో మంగళవారం నాగార్జునకొండకు లాంచీలు నిలిచిపోయాయి. శ్రీశైలం జలాశయం నుంచి 10గేట్లు ద్వారా 3,44,750 క్యూసెక్కులు, విద్యుదుత్పాదనతో మరో 65436 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. దీనికి తోడు గాలి వీస్తోంది. దీంతో సాగర్ జలాశయంలో అలజడి మొదలై అలలు ఉవ్వెత్తున లేస్తున్నాయి. ఆంధ్రా పరిధిలోని రైట్‌బ్యాంక్ నుంచి నాగార్జుకొండ మ్యూజియంలో పనిచేసే ఉద్యోగులను నిత్యం లాంచీలలో తీసుకొస్తుంటారు. అయితే గాలి వీస్తుందని అక్కడి లాంచీలు సరైన ఫిట్‌నెస్ లేకపోవడంతో నడపలేదు. మ్యూజియం తెరవకపోవడంతో తెలంగాణ నుంచి కూడా లాంచీలను నాగార్జునకొండకు నడపలేదని సిబ్బంది తెలిపారు. జాలీ ట్రిప్పులు వేసేందుకు కొంతమేరకు అవకాశమున్నప్పటికీ పర్యాటకులు లేకపోవడంతో లాంచీలను నడపలేదని సమాచారం.