
గంజాయి నిందితుల అరెస్టు
హాలియా : అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసినట్లు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖరరాజు తెలిపారు. శుక్రవారం హాలియా పోలీస్ స్టేషనల్‌లో ఆయన కేసు వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పల్నాడు జిల్లా, వెల్దుర్తి మండలం సిరిగిరిపాడు గ్రామానికి చెందిన వజ్రాల రాజశేఖర్, నల్లగొండ జిల్లా అనుముల మండలం పంగవానికుంటతండాకు చెందిన కుందాల వేణు, తిరుమలగిరి(సాగర్) మండలంలోని అల్వాల గ్రామానికి చెందిన గురజాల మహేందర్ గంజాయికి అలవాటు పడి ముఠాగా ఏర్పడ్డారు. ఆంధ్రాకు చెందిన గడిగంటి అచ్చయ్య, తిరుమలకొండ యేసుబాబు వద్ద గంజాయి కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలించి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో అనుముల మండలంలోని పంగవానికుంటతండా శివారులోని అల్వాల ఎక్స్‌రోడ్డు వద్ద శుక్రవారం గంజాయిని విక్రయిస్తున్నారనే సమాచారం పోలీసులకు అందింది. హాలియా పోలీసులు అల్వాల ఎక్స్ రోడ్డు వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురిని ఆపి తనిఖీ చేయగా 1.650 కేజీల గంజాయి లభ్యమైంది. ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం ఒప్పుకోగా, వారిని అరెస్టు చేశారు. గంజాయి సరఫరాకు సంబంధించిన గడిగంటి అచ్చయ్య, తిరుమలకొండ యేసుబాబు పరారీలో ఉన్నారని డీఎస్పీ తెలిపారు. నిందితుల వద్ద 1.650 కిలోల గంజాయి, ద్విచక్ర వాహనం, రూ.2వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కేసును ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన హాలియా సీఐ సతీష్‌రెడ్డి, ఎస్‌ఐ సాయి ప్రశాంత్‌లను డీఎస్పీ అభినందించారు.
1.650 కేజీల గంజాయి స్వాధీనం
వివరాలు వెల్లడించిన డీఎస్పీ రాజశేఖరరాజు