ఏళ్లు గడుస్తున్నా అసంపూర్తిగానే.. | - | Sakshi
Sakshi News home page

ఏళ్లు గడుస్తున్నా అసంపూర్తిగానే..

Aug 13 2025 9:27 PM | Updated on Aug 13 2025 9:27 PM

ఏళ్లు గడుస్తున్నా అసంపూర్తిగానే..

ఏళ్లు గడుస్తున్నా అసంపూర్తిగానే..

భూదాన్‌పోచంపల్లి: ప్రభుత్వాలు మారినా మూసీ నదిపై చేపట్టిన బ్రిడ్జి నిర్మాణాలు పూర్తికావడం లేదు. ప్రభుత్వం లోలెవల్‌ బ్రిడ్జిలను హైలెవల్‌ బ్రిడ్జిగా నిర్మించేందుకు నిధులు మంజూరు చేసినా చేసిన పనులకు బిల్లులు వస్తలేవని సదరు కాంట్రాక్టర్లు పనులను అర్ధాంతరంగా నిలిపివేశారు. ఫలితంగా వర్షాకాలంలో భూదాన్‌పోచంపల్లి మండలం నుంచి బీబీనగర్‌, భువనగిరి మండలాలకు రాకపోకలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పిల్లర్ల దశలోనే..

భూదాన్‌పోచంపల్లి మండలం జూలూరు– రుద్రవెల్లి గ్రామాల మధ్యన నిర్మించిన లోలెవల్‌ బ్రిడ్జి శిథిలావస్థకు చేరడంతో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హైలెవల్‌ బ్రిడ్జి నిర్మించేందుకు నాబార్డు నుంచి రూ.8.50 కోట్ల నిధులు మంజూరు చేసింది. 2016 జూన్‌లో పనులు ప్రారంభించారు. కానీ భూసేకరణలో అధికారుల జాప్యం, కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం వెరసి నాబార్డు ఇచ్చిన గడువు 2021 మార్చి 31తో ముగియడంతో ఆ నిధులు ల్యాప్స్‌ అయ్యాయి. అనంతరం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ కింద రూ.10.50 కోట్లు మంజూరు కావడంతో ఏడాది క్రితం 8 పిల్లర్లను అసంపూర్తిగా నిర్మించి వదిలేశారు.

మూసీ పొంగితే స్కూల్‌ డుమ్మా..

పోచంపల్లి, బీబీనగర్‌ రెండు మండలాల ప్రజలు రాకపోకలు సాగించడానికి జూలూరు–రుద్రవెల్లి గ్రామాల మధ్యన ఉన్న మూసీ బ్రిడ్జే ప్రధానమైనది. ఈ మార్గం గుండానే పోచంపల్లి మండల ప్రజలు బీబీనగర్‌, భువనగిరి, ఘట్కేసర్‌కు వెళ్తుంటారు. దీంతో నిత్యం వాహనాలతో రద్దీగా ఉంటుంది. అంతేకాక బీబీనగర్‌ మండల పారిశ్రమల్లో పనిచేసేందుకు మండలంలోని పలు గ్రామాల నుంచి యువకులు వెళ్తుంటారు. అదేవిధంగా బీబీనగర్‌ మండలం రుద్రవెల్లి గ్రామానికి చెందిన విద్యార్థులు పోచంపల్లి మండలం జూలూరు జెడ్పీ హైస్కూల్‌కు వస్తుంటారు. వర్షాకాలంలో లోలెవల్‌ బ్రిడ్జిపై నుంచి మూసీ పొంగి ప్రవహిస్తుంటుండంతో ఈ మార్గంలో రాకపోకలు ఒక్కోసారి 15 నుంచి 20 రోజుల వరకు స్తంభిస్తుంటాయి. దీంతో మూసీ పొంగిన ప్రతిసారి రుద్రవెల్లి గ్రామ విద్యార్థులకు స్కూల్‌ బంద్‌ అవుతుంది.

రెండుసార్లు గడువు పొడిగించినా సాగని పనులు

శివారెడ్డిగూడెం–రెడ్డిబావి(దంతూర్‌) గ్రామాల మధ్యన చిన్నేరుపై నిర్మించిన లోలెవల్‌ బ్రిడ్జి శిథిలావస్థకు చేరడంతో హైలెవల్‌ బ్రిడ్జి నిర్మించేందుకు 2021లో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజన పథకం కింద రూ.6.22 కోట్లు మంజూరు చేసింది. గత ప్రభుత్వ హయాంలో 2022 జనవరిలో పనులు ప్రారంభించారు. అగ్రిమెంట్‌ ప్రకారం ఏడాదిన్నర లోపు అంటే సెప్టెంబర్‌ 2023లోపు పనులు పూర్తి చేయాల్సి ఉంది. కాని బిల్లులు రావడం లేదన్న కారణంతో పిల్లర్ల దశలోనే పనులు నిలిచిపోయాయి. గడువుతీరినా ప్రభుత్వం మరోసారి ఈ సంవత్సరం మార్చి 31 వరకు పొడిగించింది. కానీ పనుల్లో చెప్పుకోదగ్గ పురోగతి లేదు. రెండోసారి ఇచ్చిన గడువు కూడా ముగిసింది.

తప్పని తిప్పలు

ధర్మారెడ్డిపల్లి, వంకమామిడి, రెడ్డిబావి తదితర గ్రామాల ప్రజలకు మండల కేంద్రానికి రావడానికి, ఇంద్రియాల, శివారెడ్డిగూడెం, పెద్దరావులపల్లి గ్రామాల ప్రజలు చౌటుప్పల్‌కు వెళ్లడానికి ఇదే ప్రధాన మార్గం. రైతులు కూడా తమ పంట పొలాల వద్దకు ఈ మార్గం గుండా వెళ్తుంటారు. వర్షాకాలంలో లోలెవల్‌ బ్రిడ్జి పై నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయి ఆ ప్రాంత ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

సర్వేతోనే సరి..

ఇంద్రియాల, జంపల్లి గ్రామాల మధ్య మూసీపై బ్రిడ్జి నిర్మాణానికి గత ప్రభుత్వం రూ.2.15 కోట్లు, శివారెడ్డిగూడెం, సూరెపల్లి గ్రామాల మధ్యన మూసీపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.2.25 కోట్లు మంజూరు చేసింది. గత సంవత్సరం ఆగస్టులో కేవీఆర్‌ కన్సల్టెంట్‌ సంస్థ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్‌ అధికారులు సర్వే నిర్వహించారు. కానీ పనుల్లో ఎలాంటి పురోగతి లేదు.

వర్షాకాలంలో ఇబ్బంది అవుతోంది

మా ఊర్లో 5వ తరగతి వరకే ఉంది. గ్రామం నుంచి 20 మంది విద్యార్థులం జూలూరు హైస్కూల్‌కు ఆటోలు, బస్సుల్లో వెళ్తున్నాం. రుద్రవెల్లి, జూలూరు మధ్యన బ్రిడ్జిపై నుంచి వరద ప్రవహిస్తుండడంతో స్కూల్‌కు వెళ్లలేదు. వర్షాకాలంలోనైతే బిక్కుమంటూ వచ్చిపోతుంటాం. మూసీ పొంగినప్పుడల్లా స్కూల్‌కు వెళ్లలేకపోతున్నాం.

– దర్శనం తులసి, 7వ తరగతి, రుద్రవెల్లి గ్రామం, బీబీనగర్‌ మండలం

బ్రిడ్జిని పట్టించుకోవడం లేదు

జూలూరు–రుద్రవెల్లి బ్రిడ్జిని అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. తొమ్మిదేళ్ల క్రితం పనులు మొదలు పెట్టారు. ఇంకా పిల్లర్ల దశలోనే ఉన్నాయి. వర్షాకాలంలో లోలెవల్‌బ్రిడ్జి పై నుంచి వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపో తున్నాయి. భువనగిరికి వెళ్లాలంటే పెద్దరావులపల్లి మీదుగా చుట్టూ 22 కిలోమీటర్లు తిరిగి పోవాల్సి వస్తుంది. – వట్టిపల్లి శ్రీశైలం, రైతు,

జూలూరు గ్రామం, భూదాన్‌పోచంపల్లి

ఫ తొమ్మిదేళ్లుగా సాగుతున్న

జూలూరు– రుద్రవెల్లి బ్రిడ్జి పనులు

ఫ మూడున్నర ఏళ్లు దాటినా

ముందుకు పడని శివారెడ్డిగూడెం బ్రిడ్జి

ఫ వర్షాకాలంలో స్తంభిస్తున్న రాకపోకలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement