కార్మికుల ప్రాణాలు.. గాలిలో దీపాలు! | - | Sakshi
Sakshi News home page

కార్మికుల ప్రాణాలు.. గాలిలో దీపాలు!

Aug 13 2025 9:27 PM | Updated on Aug 13 2025 9:27 PM

కార్మికుల ప్రాణాలు.. గాలిలో దీపాలు!

కార్మికుల ప్రాణాలు.. గాలిలో దీపాలు!

సాక్షి, యాదాద్రి : పరిశ్రమల్లో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. కనీస భద్రతాప్రమాణాలు పాటించకపోవడంతో కార్మికుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఈ ఏడాది పెద్ద కందుకూరు, కాటేపల్లిలోని ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ కంపెనీల్లో నాలుగు సార్లు ప్రమాదాలు జరగగా.. ఆరుగురు కార్మికులు మృతిచెందారు. మరికొందరు గాయాలపాలయ్యారు. మంగళవారం తెల్లవారుజామున పెద్దకందుకూరు ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌లో జరిగిన ప్రమాదంలో ఒక కార్మికుడు మృతి చెందాడు. హైరిస్క్‌ ఉన్న ఈ పరిశ్రమల్లో అధికారుల తనిఖీలు రికార్డులకే పరిమితమవుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి.

తనిఖీలకు మీనమేషాలు..

పరిశ్రమల్లో కార్మికుల భద్రతపై తనిఖీలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. అధిక రిస్క్‌ ఉన్న ఫ్యాక్టరీలు, పరిశ్రమలను తక్షణమే తనిఖీ చేయాలని ప్రభుత్వం జీవో 331 జారీ చేసింది. ఇందులో భాగంగా ఈనెల 6న కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జిల్లా తనిఖీల కమిటీలను ఏర్పాటు చేశారు. అయినా ఇంత వరకు జిల్లాలో ఉన్న హైరిస్క్‌ పరిశ్రమల్లో తనిఖీలు ప్రారంభించలేదు. దీంతో జిల్లాలోని పేలుడు పదార్థాల తయారీ పరిశ్రమలు, రసాయన, ఫార్మా కంపెనీలలో ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఇటీవల పరిశ్రమల్లో జరిగిన

ప్రమాద ఘటనల వివరాలు

● 2024లో చౌటుప్పల్‌ మండలం కొయ్యలగూడెం ఫార్మా కంపెనీలో బాయిలర్‌ పేలి కార్మికుడు చనిపోయాడు. అదేవిధంగా భువనగిరిలోని ఇండస్ట్రియల్‌ పార్కులో రియాక్టర్‌ పేలి కార్మికులు గాయపడ్డారు. అదే సంవత్సరం బీబీనగర్‌ గ్రామ శివారులోని శ్రీయా కంపెనీలో అణు రియాక్టర్‌ పేలింది. గతంలోనే బీబీనగర్‌ మండలం నెమరగోముల వద్ద గల కంపెనీలో రియాక్టర్‌లు పేలి ఎనిమిది మంది కార్మికులు చనిపోయారు. ఈ ఘటన అనంతరం ఆ కంపెనీ మూతపడింది.

● ఈ ఏడాది జనవరి 4న పెద్ద కందుకూరులోని ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ కంపెనీలో ప్రొడక్ట్‌ రీసెర్చ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌లో ఫైర్‌ డివైసెస్‌ ఫిల్లింగ్‌, ప్రెస్సింగ్‌ బ్లాక్‌లో కెమికల్‌ పెల్లెట్స్‌ను తూకం వేసే సెక్షన్‌లో జరిగిన ప్రమాదంలో ఒక కార్మికుడు చనిపోయాడు. మరికొందరు గాయపడ్డారు. ఇదే కంపెనీలో 2012, 2019, 2020లో జరిగిన ప్రమాదాల్లో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.

● ఏప్రిల్‌ 29న మోటకొండూరు మండలం కాటేపల్లి వద్ద ఎక్స్‌ప్లోజివ్స్‌ కంపెనీలో జరిగిన ప్రమాదంలో నలుగురు కార్మికులు దుర్మరణం చెందారు. మరికొందరు గాయపడ్డారు.

● జూలై 7న ప్రీమియర్‌ పరిశ్రమలో పీఆర్‌డీసీ బ్లాక్‌– 2లో కెమికల్‌ను తూకం వేస్తున్న క్రమంలో కెమికల్‌ మధ్య రాపిడి ఏర్పడి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి.

● మంగళవారం పెద్ద కందుకూరు ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌లో స్టీమ్‌ పైప్‌ ఓపెన్‌ చేసే క్రమంలో జరిగిన ప్రమాదంలో సదానందం అనే కార్మికుడు మృతి చెందాడు.

ఎక్స్‌ప్లోజివ్‌, ఫార్మా

కంపెనీలకు అడ్డా..

భువనగిరి, రాయిగిరి, బీబీనగర్‌ పారిశ్రామిక వాడలోని రాయిగిరి, నెమరగోముల, కొండమడుగు, బీబీనగర్‌, యాదగిరిగుట్ట, పెద్ద కందుకూరు, మోటకొండూరు మండలం కాటేపల్లి, చౌటుప్పల్‌ మండలం కొయ్యలగూడెం, దండు మల్కాపురం, దేవలమ్మ నాగారం, ఎల్లంబావి, తంగడపల్లి, చౌటుప్పల్‌, ధర్మోజిగూడెం, లింగోజి గూడెం, ఆరెగూడెం, పంతంగి, ఎస్‌,లింగోటం మందోళ్ల గూడెం, చిన్న కొండూరు, జైకేసారం, పోచంపల్లి మండలం దోతిగూడెం, అంతమ్మగూడెం, ఆలేరు మండలం టంగుటూరు ఇలా జిల్లా వ్యాప్తంగా పేలుడు పదార్థాల పరిశ్రమలు, ఫార్మా కంపెనీలు ఉన్నాయి.

ఆలేరులో విషాదం

ఆలేరు: ఉన్న ఊరిని కన్న వారిని వదిలి బతుకుదెరువు కోసం వచ్చిన వలస కార్మికుడి మృతి బాధిత కుటుంబంలో విషాదాన్ని నింపింది. గోదావరిఖని ప్రాంతానికి చెందిన సదానందం(48) ఉద్యోగం రీత్యా భార్య అఖిల, ఇద్దరు కుమారులతో ఆలేరుకు వచ్చి స్థిరపడ్డాడు. మైత్రి కాలనీలో నివాసం ఉంటున్నారు. పెద్దకుమారుడు శ్రీరామ్‌ సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేస్తున్నాడు. చిన్నకుమారుడు శ్రీనాథ్‌ ఇంజనీరింగ్‌ చదువుతున్నాడు. సదానందం దాదాపు 25ఏళ్లుగా యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరులోని ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్‌ పరిశ్రమలో పని చేస్తున్నాడు. కార్మిక యూనియన్‌లోనూ చురుకుగా వ్యవహరించే సదానందం మంగళవారం కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృతి చెందడంతో మైత్రి కాలనీలోని ఆయన ఇంటి వద్ద విషాదం అలుముకుంది. ఆలేరులో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

డ్యూటీ షిఫ్ట్‌ ఛేంజ్‌?

సదానందం మంగళవారం మధ్యాహ్నం డ్యూటీకి వెళ్లాల్సి ఉండగా, ఉదయం షిఫ్ట్‌కి మార్చుకున్నట్లు తెలిసింది. అయితే యూనియన్‌ సమావేశానికి హాజరుకావాలనే ఆలోచనతో ఉదయం షిఫ్ట్‌కు హాజరైనట్లు సమాచారం.

ఫ పరిశ్రమల్లో తరచూ

సంభవిస్తున్న ప్రమాదాలు

ఫ కనీస భద్రతాప్రమాణాలు

పాటించని యాజమాన్యాలు

ఫ తనిఖీలు నిర్వహించని

సంబంధిత అధికారులు

ఫ ఈ ఏడాది ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌లో నాలుగు సార్లు ప్రమాదాలు జరగగా.. ఆరుగురు కార్మికులు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement