
మారుతి కోటెక్స్‌లో జాతీయ జెండాల తయారీ
చౌటుప్పల్ : పట్టణ కేంద్రంలోని మారుతి కోటెక్స్ పరిశ్రమలో జాతీయ జెండాల తయారీ ముమ్మరంగా జరుగుతోంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ జెండాలను ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ప్రత్యేకంగా ఆర్డర్ లభించడంతో ఇటీవల ఉత్పత్తిని మొదలుపెట్టారు. త్రివర్ణ పతాకాల కోసం కాంట్రాక్టర్ ఈ కంపెనీకి 5లక్షల మీటర్ల సాదా వస్త్రాన్ని సరఫరా చేశారు. అక్కడి నుంచి అందిన వస్త్రాన్ని మారుతి కోటెక్స్ పరిశ్రమలో 8లక్షల జాతీయ జెండాలు తయారు చేసి ఇవ్వాల్సి ఉంది. అందులో భాగంగా ఇప్పటికే ప్రత్యేక వాహనాల ద్వారా సగానికిపైగా జెండాలను ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి తరలించారు. ఇంకా మిగిలిన సగం జెండాలు సైతం ఈ నెల 13లోపు అక్కడికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.
వివిధ రకాల వస్త్రాలను ఉత్పత్తి చేస్తున్నాం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి జాతీయ పతాకాల ఆర్డర్ వచ్చింది. ఇప్పటికే సగానికిపైగా ఎగుమతి చేశాము. మిగిలినవి కూడా గడువులోగా పంపిస్తాము. పరిశ్రమలో రకరకాల వస్త్రాలను ఉత్పత్తి చేస్తుంటాము. 2021–2023 వరకు మూడు పర్యాయాలు బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేశాము. నిత్యం 150మంది కూలీలకు ఉపాధి లభిస్తుంది.
– వనం రాజు,
మారుతీ కోటెక్స్ పరిశ్రమ మేనేజర్