
డీసీసీబీ.. నంబర్ వన్!
అందుబాటులోకి మరిన్ని సేవలు
రాష్ట్రంలోనే ఉత్తమ సహకార బ్యాంక్ అవార్డు సొంతం
ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు వ్యాపార లక్ష్యం రూ.3,500 కోట్లకు పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. తద్వారా రూ.70 కోట్ల లాభాలను సాధించేలా చర్యలు చేపడుతోంది. సహకార వ్యవస్థ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తూనే మిగతా డీసీసీబీల కంటే నల్లగొండ డీసీసీబీ రైతు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో ముందంజలో ఉంది. దీంతో నాబార్డు ప్రతి ఏటా ఇచ్చే ఉత్తమ బ్యాంకు అవార్డుకు ఈసారి నల్లగొండ బ్యాంకును ఎంపిక చేసింది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును బ్యాంకు చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి, ఇతర డైరెక్టర్లు, అధికారులకు అందజేసింది.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ డీసీసీబీ రాష్ట్రంలోనే ఉత్తమ బ్యాంకుగా నిలిచింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రైతులకు ఆర్థికంగా చేయూతను అందించి ముందంజలో నిలువడమే కాకుండా డిపాజిట్ల పెంపుతో వ్యాపార వృద్ధిని సాధించింది. మొండిబకాయి(ఎన్‌పీఏ)లను తగ్గించుకోవడంతోపాటు రూ.42 కోట్ల లాభాలను ఆర్జించి, రైతులు, ఖాతాదారులకు ఉత్తమ సేవలు అందించినందుకు గాను నాబార్డు నల్లగొండ డీసీసీబీకి బెస్ట్ పర్‌ఫార్మింగ్ బ్యాంకు అవార్డును అందజేసింది.
లాభాల బాటలో..
నల్లగొండ డీసీసీబీ గత ఆర్థిక సంవత్సరంలో వ్యాపారాన్ని రూ.2342.13 కోట్ల నుంచి రూ.2940.13 కోట్లకు పెంచింది. తద్వారా ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే రూ.598.16 కోట్లు వృద్ధిని సాధించింది. రాష్ట్రంలో ఏ ఇతర డీసీసీబీలు ఇంతగా వృద్ధి రేటును సాధించలేదు. ఇక లాభాల విషయంలోనూ రూ.22 కోట్ల నుంచి రూ. 42 కోట్లకు పెంచగలిగింది. గతంలో ఎన్నడూలేని విధంగా దాదాపు రెట్టింపు లాభాలను గడించి ఉత్తమ బ్యాంకుగా నిలిచింది. గతంలో 1.85 శాతం ఉన్న మొండిబకాయి(ఎన్‌పీఏ)లను 1.38 శాతానికి తగ్గించుకొని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
పంట రుణాల బడ్జెట్ పెంపు
రైతులకు పంట రుణాల విషయంలోనూ ఉత్తమ ప్రతిభను కనబరిచినట్లు నాబార్డు గుర్తించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.110 కోట్లు రైతులకు రుణాలుగా అందించి వారి సంక్షేమం, అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలిచింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఒక్క వానాకాలం సీజన్‌లోనే రైతులకు రూ.50 కోట్ల పంట రుణాలను ఇచ్చేలా చర్యలు చేపట్టింది. అవసరమైతే మరో రూ.50 కోట్లు రైతులకు పంట రుణాలుగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రైతులకు పంట రుణాల గరిష్ట పరిమితిని రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షలకు పెంచింది.
అనుబంధ రంగాలకు ప్రాధాన్యం
వ్యవసాయ అనుబంధ రంగాలైన నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ కింద రెతులకు కోళ్లు, కోళ్ల ఫారాలు, పాడి పరిశ్రమకు రుణాలు ఇస్తోంది. సొసైటీల ఆధ్వర్యంలో రైతులకు ఉపయోగపడేలా గోదాముల నిర్మాణానికి రుణాలు, సహకార సంఘాలకు నాబార్డు రీఫైనాన్స్ ద్వారా కిసాన్ డ్రోన్‌లు ఇచ్చి బలోపేతానికి కృషి చేస్తోంది. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లో గృహ రుణాలు కూడా ఇచ్చేలా చర్యలు చేపట్టింది.
ఫ గత ఆర్థిక సంవత్సరంలో అదనంగా రూ.598.16 కోట్ల వృద్ధి
ఫ మిగతా బ్యాంకులతో పోలిస్తే
నల్లగొండ డీసీసీబీకి రెట్టింపు లాభాలు
ఫ మొండి బకాయిలు తగ్గుదల
ఫ రైతులకు చేయూత
అందించడంలోనూ ముందంజ
బ్యాంకు సేవలను రైతులకు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపడుతున్నాం. ఎక్కువ మంది రైతుల అభివృద్ధికి తోడ్పాటు అందించేలా చూస్తున్నాం. ఇందులో భాగంగానే గత ఆర్థిక సంవత్సరంలో ఐదు కొత్త బ్రాంచ్‌లను ఏర్పాటు చేశాం. ఈ ఆర్థిక సంవత్సరంలోనూ మరో ఆరు కొత్త బ్రాంచ్‌లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాం. రైతులు, ఖాతాదారులకు ఉత్తమ సేవలను అందించడం ద్వారా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉండేలా పాలకవర్గం కృషి చేస్తోంది.
– కుంభం శ్రీనివాస్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్

డీసీసీబీ.. నంబర్ వన్!

డీసీసీబీ.. నంబర్ వన్!