
సకాలంలో ఇంటి బిల్లు!
ఆధార్ ప్రకారం చెల్లింపులు
సాక్షి, యాదాద్రి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబ్ధిదారులకు బిల్లులు సకాలంలో అందేలా అధికారులు చర్యలు చేపట్టారు. వివిధ దశల్లో పూర్తయిన నిర్మాణాలకు బిల్లులు అందడం లేదన్న ఫిర్యాదులున్నాయి. ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు క్షేత్ర పర్యటనకు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. జూలై 31న హౌసింగ్ కార్పొరేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గౌతం జిల్లా పర్యటనలోనూ లబ్ధిదారులు సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.ఈ నేపథ్యంలో బిల్లుల చెల్లింపులో జాప్యాన్ని నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇంటి పునాది, గోడలు, లెంటల్, స్లాబ్ వరకు ప్రతి పని వివరాలను లబ్ధిదారు పేరున ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. దీంతో పాటు ఏ అధికారి పర్యవేక్షణలో ఇంటి నిర్మాణం జరుగుతుందనే సమాచారాన్ని సైతం ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. తద్వారా బిల్లు ఎందుకు పెండింగ్ ఉంది, అందుకు కారణాలను తన మొబైల్‌లో సంబంధిత యాప్‌లో తెలుసుకునే అవకాశాన్ని లబ్ధిదారులకు ప్రభుత్వం కల్పించింది. దీంతో సమస్యను గుర్తించి వెంటనే సరిదిద్దుకునే అవకాశం ఏర్పడింది.
ఆధార్ లింక్ కలిగిన ఖాతాకు జమ
బిల్లు మంజూరులో ఎదురవుతున్న సాంకేతిక సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఆధార్ అనుసంధానం కలిగిన బ్యాంక్ ఖాతాలో బిల్లు జమ చేస్తోంది. ఈ విధానం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో తీసిన లబ్ధిదారుల ఫొటోలను యాప్‌లో అప్‌లోడ్ చేసిన వివరాల ఆధారంగా బిల్లు మంజూరయ్యేది. కానీ బ్యాంకులు, ఇతర సాంకేతిక సమస్యల వల్ల జాప్యం అవుతోంది. దీన్ని నివారించడానికి అధార్ పేమెంట్ బిల్ విధానాన్ని ప్రారంభించారు. లబ్ధిదారుకు వేర్వేరు బ్యాంకుల్లో ఖాతాలున్నా తాజాగా లావాదేవీలు నిర్వహిస్తున్న ఖాతాలోనే బిల్లు జమకానుంది.
వెబ్‌సైట్‌లో మార్పులు
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వివరాలను ప్రభుత్వం ఇప్పటికే ఆన్‌లైన్‌లో నమోదు చేసింది. అదే విధంగా వెబ్‌సెట్‌లో పలుమార్పులు తీసుకువచ్చి ఇళ్ల సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందుపరుస్తుంది. దీంతో లబ్ధిదారులు బిల్లు కోసం అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఎక్కడినుంచైనా తమ సెల్‌ఫోన్ ద్వారా ఇంటి ప్రగతిని తెలుసుకునేందుకు అవకాశం ఏర్పడింది. లబ్ధిదారు రేషన్, ఆధార్‌కార్డు, సెల్‌ఫోన్.. వీటిలో ఏ నంబర్‌తో అయినా indirammaindlu telangana.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్ కావచ్చు. తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ భాషల్లో ఇంటి సమాచారం అందుబాటులో ఉంటుంది.
తొలి విడత ఇందిరమ్మ ఇళ్లు
మంజూరైన గృహాలు 9,398
పనులు మొదలుకానివి 1857
మార్కింగ్ ఇచ్చినవి 7,541
బేస్మెంట్ లెవల్ 3,669
రూప్ లెవల్ 346
స్లాబ్ దశలో.. 145
పూర్తయిన గృహాలు 04
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆధార్ బేస్డ్ ఆధారంగా 1,071 మందికి బిల్లులు మంజూరు చేశాం.శ్లాబ్, లెంటల్, రూప్ లెవల్ వరకు నిర్మాణాలు పూర్తయిన లబ్ధిదారులందరి ఖాతాల్లో బిల్లులు జమయ్యాయి. ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయడంలో భాగంగా బిల్లుల చెల్లింపులో జాప్యాన్ని నివారించడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇందులో భాగంగా ఆధార్ బేస్డ్ చెల్లింపులు చేస్తున్నాం.
–విజయ్‌సింగ్, హౌసింగ్ పీడీ
ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల చెల్లింపుల్లో జాప్యానికి చెక్
ఫ ఏరోజుకారోజు ఆన్‌లైన్‌లో పనుల వివరాలు నమోదు
ఫ ఆలస్యానికి కారణాలు నేరుగా తెలుసుకునే అవకాశం
ఫ సమస్యలను సరిదిద్దుకునేందుకు లబ్ధిదారులకు వెసులుబాటు