
ఇన్‌చార్జ్ ఏఈ బాధ్యతల తొలగింపు!
ఆలేరు: ఆలేరు మున్సిపాలిటీలో రెగ్యులర్ అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ) నియామకం మాట దెవుడెరుగు..ఉన్న ఇన్‌చార్జ్ ఏఈని ఉన్నతాధికారులు తొలగించారు. దాంతో ఇంజనీరింగ్ విభాగం పర్యవేక్షణ, అభివృద్ధి పనుల పురోగతి ప్రశ్నార్థకంగా మారింది. భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు మున్సిపాలిటీలకు ఏఈగా సురేష్ కొంతకాలంగా కొనసాగుతున్న విషయం తెలసిందే. తాజాగా ఆయనకు మోత్కూరు మున్సిపాలిటీ బాధ్యతలు కూడా అధికారులు అప్పగించారు. నాలుగు మున్సిపాలిటీల్లో బాధ్యతలు నిర్వర్తించడం వీలుకాదనే కారణంతో ఆలేరు బాధ్యతల నుంచి సురేష్‌ను తప్పించినట్టు తెలిసింది. కొత్తగా ఎవరినీ నియమించలేదు. కొత్తగా ఎవరినైనా నియమిస్తారా? ఎలాగో అలా నెట్టుకొస్తారా.. అనేది వేచి చూడాల్సిందే మరి.
శివుడికి రుద్రాభిషేకం
యాదగిరిగుట్ట: యాదగిరి క్షేత్రానికి అనుబంధంగా ఉన్న శ్రీపర్వతవర్థిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం రుద్రాభిషేకం, బిల్వార్చన, ముఖ మండపంలో స్ప టికలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల్లో ఈఓ వెంకట్రావ్, భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ప్రధానాలయంలోనూ నిత్యారాధనలు నిర్వహించారు. వేకువజామున సుప్రభాత సేవ, గర్భాలయంలో స్వయంభూలకు అభిషేకం, అర్చన, ప్రాకారమండపంలో సుద ర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం తదితర పూజలు చేశారు.
గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి
భువనగిరి: గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని భువనగిరి పట్టణ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు రత్నపురం శ్రీశైలం పేర్కొన్నారు. సోమవారం పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 27నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయని, మండపాల ఏర్పాటుకు ఇబ్బందులు కలగకుండా సహకరించేలా అధికారులతో చర్చిస్తామని చెప్పారు. భువనగిరి పట్టణంలోని అన్ని గణేష్ యూత్ అసోసియేషన్లతో నెల 19న సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు, నిర్వాహకులు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. ఈ సమావేశంలో ఉత్సవ సమితి గౌరవ సలహాదారులు సుర్వి శ్రీనివాస్‌గౌడ్, దేవరకొండ నర్సింహాచారి, ప్రధాన బెల్లంకొండ చందు, ఉపాధ్యక్షుడు రాజు, రాజ్‌కుమార్, సురేష్, తాడూరి కిష్టయ్య, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
నేడు మాతం ప్రదర్శన
భువనగిరిటౌన్ : షియా ముస్లిం సంఘం ఆధ్వర్యంలో ప్రవక్త మహమ్మద్ (స.అ) మనువడు ఇమాం హుస్సేన్ (అ.స) ఆయన అనుచరులు 72 మంది బలిదానాన్ని స్మరిస్తూ (40 రోజులు, వారాలు) అర్బయీన్ పురస్కరించుకుని మంగళవారం భువనగిరిలో మాతం ప్రదర్శన నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ రజా హుస్సేన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 3గంటలకు ఖిలా పీర్ల చావడినుంచి జంప్‌ఖానగూడెంలోని హజ్రత్ ఆబ్బాస్ పీర్లకొట్టం మీదుగా, ఖాజీమోహల్లా బీబీకా అలావా పీర్ల చావడి వరకు మాతం ప్రదర్శన ఉంటుందన్నారు. యువత కత్తులతో ఎదను బాదుకుంటూ విషాద గీతాలు నోహా, మర్సియా పఠిస్తారని వెల్లడించారు. షియా మౌల్వి ముహమ్మద్ ఆలి ధార్మిక ప్రసంగం చేస్తారని పేర్కొన్నారు.

ఇన్‌చార్జ్ ఏఈ బాధ్యతల తొలగింపు!