కల్తీ ఇంజన్ ఆయిల్ వ్యాపారి అరెస్టు
సూర్యాపేటటౌన్ : కల్తీ ఇంజన్ ఆయిల్ తయారు చేసే వ్యాపారిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం సూర్యాపేటలోని జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కేసు వివరాలను ఎస్పీ నరసింహ వెల్లడించారు. శుక్రవారం రామాపురం క్రాస్ రోడ్డు వద్ద సీసీఎస్, కోదాడ రూరల్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా కల్తీ ఇంజన్ ఆయిల్ బాటిల్స్‌తో వ్యాపారి పట్టుబడ్డాడు. అతడిని విచారించగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడకు చెందిన కాకాని నాగ వెంకటేశ్వరరావుగా గుర్తించారు. అతడు విజయవాడలోని ఓ ఇంజన్ ఆయిల్ కంపెనీలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేశాడు. ఇంజన్ ఆయిల్ తయారీలో అనుభవం ఉన్న నాగ వెంకటేశ్వరరావు సులభంగా డబ్బులు సంపాదించాలని అనుకున్నాడు. ఈక్రమంలో కలకత్తా నుంచి ప్రముఖ కంపెనీలకు చెందిన ఆయిల్ డబ్బాల స్టిక్కర్లు, లేబుల్స్, ప్లాస్టిక్ టిన్స్ తెప్పించాడు. విజయవాడలో దొరికే మడ్డి ఆయిల్ ఫిల్టర్ చేసే వారి నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి విజయవాడలో తన ఇంటి వద్దనే లీటర్ ప్లాస్టిక్ బాటిల్స్‌లో నింపి స్టిక్కర్లు అతికించి లీటర్ రూ.200 చొప్పున బైక్ మెకానిక్‌లకు విక్రయించడం ప్రారంభించాడు. 2007లో విజయవాడలోని తన ఇంటిలో కల్తీ ఇంజన్ ఆయిల్‌ను బాటిల్స్‌లో నింపుతుండగా విజయవాడ వన్ టౌన్ పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశాడు. రెండు రోజులు విజయవాడ జైల్లో ఉన్నాడు. తర్వాత వ్యాపారం బంద్ చేశారు. మళ్లీ కల్తీ ఇంజన్ ఆయిల్ తయారుచేయాలని నిర్ణయించుకున్నాడు. ఆయిల్ బాటిల్స్‌ను కారులో వేసుకుని నేరేడుచర్ల, మిర్యాలగూడ బైక్ మెకానిక్‌లకు అమ్ముతున్నాడు. శుక్రవారం ఉదయం కారులో కల్తీ ఇంజన్ ఆయిల్ బాటిల్స్‌తో రామాపురం క్రాస్ రోడ్డు వద్దకు వస్తుండగా సూర్యాపేట సీసీఎస్ పోలీసులు, కోదాడ రూరల్ పోలీసులు తనిఖీ చేసి పట్టుకున్నారు. అతడి నుంచి రూ.2లక్షల విలువైన ఆయిల్‌తోపాటు, కారును స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడిని పట్టుకున్న సీసీఎస్ సీఐ శివ, సిబ్బంది, కోదాడ రూరల్ సీఐ రజితరెడ్డి, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సమావేశంలో అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, డీఎస్పీ ప్రసన్నకుమార్, కోదాడ రూరల్ సీఐ రజితరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
నిందితుడి నుంచి రూ.2లక్షల విలువైన కల్తీ ఆయిల్‌తోపాటు, కారు స్వాధీనం
వివరాలు వెల్లడించిన ఎస్పీ నరసింహ


