వీధి వా్యపారులకు క్రెడిట్ కార్డులు
భువనగిరి: వీధి వ్యాపారులకు ఆర్థికంగా చేయూతనివ్వాలనే ఉద్దేశంతో కరోనా పరిస్థితుల అనంతరం కేంద్ర ప్రభుత్వం 2020 జూన్‌లో ప్రధాన మంత్రి ఆత్మనిర్భర్ నిధి (పీఎం స్వనిధి యోజన) పథకాన్ని తీసుకువచ్చింది. మూడు విడతల్లో వ్యాపారులకు తక్కువ వడ్డీతో బ్యాంకుల ద్వారా స్వల్పకాలిక రుణాలు అందజేసింది. ఐదేళ్లు పూర్తి కావడంతో ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా నిలిపివేసింది. అయితే రుణం తీసుకుని సకాలంలో చెల్లించిన వారికి కొత్తగా క్రెడిట్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
జిల్లాలో 9119 మంది
వీధి వ్యాపారులు
జిల్లా వ్యాప్తంగా భువనగిరి, చౌటుప్పల్, ఆలేరు, యాదగిరిగుట్ట, పోచంపల్లి, మోత్కూర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆయా మున్సిపాలిటీల్లో 9,119 మంది వీధి వ్యాపారులు ఉన్నట్లు గుర్తించారు. ఎంపిక చేసిన వ్యాపారులకు మొదటి విడత కింద రూ.10వేలు, రెండో విడత కింద రూ. 20వేలు, మూడో విడతలో రూ.50వేల చొప్పున రుణాలు అందజేశారు. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో గుర్తించిన వీధి వ్యాపారుల్లో 7,168 మంది లబ్ధిదారులకు రూ.20.09కోట్ల రుణాలు మంజూరు చేశారు.
సకాలంలో చెల్లించిన
వారికి ఉపయోగం
ఎక్కువ వేతనంతో ఉద్యోగంతో పాటు సిబిల్ స్కోర్ ఉన్న వారికే బ్యాంకులు క్రెడిట్ కార్డులు మంజూరు చేస్తాయి. కానీ వీధి వ్యాపారులకు ఎలాంటి నిబంధన లేకుండానే రూ.30వేల నుంచి రూ.50వేల పరిమితితో కార్డులు అందజేయనున్నారు. ఈ పథకంలో భాగంలో గతంలో మూడు విడతల్లో రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన వ్యాపారులనే ఎంపిక చేయనున్నారు. క్రెడిట్ కార్డులు పొందిన వారు అవసరం వచ్చినప్పుడు బ్యాంకులో నగదును డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అవసరమైన వస్తువులను ఈ కార్డు ద్వారా కొనుగోలు చేసి వ్యాపారాన్ని మరింతగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. బిల్లు వచ్చాక నిర్ణీత కాలవ్యవధిలో చెల్లిస్తే వడ్డీ ఉండదు.
పీఎం స్వనిధి యోజన కింద రుణాలు తీసుకుని చెల్లించిన వారికి అందజేత
లబ్ధిపొందనున్న 7,168 మంది
వీధి వ్యాపారులు
ఇంకా ఆదేశాలు రాలేదు
గతంలో రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన వీధి వ్యాపారులకు క్రెడిట్ కార్డులు మంజూరు చేసే ప్రక్రియపై ప్రభుత్వం నుంచి ఇంకా ఆదేశాలు రాలేదు. ఉత్తర్వులు జారీ చేసిన అనంతరం మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. గతంలో రుణాలు తీసుకుని క్రమం తప్పకుండా చెల్లించిన వారికి ప్రయోజనం ఉంటుంది.
– రమేష్‌బాబు మెప్మా పీడీ
రుణాలు పొందిన వారి
వివరాలు (రూ. కోట్లలో)
విడత వీధి వ్యాపారులు పంపిణీ
మొదటి 7,168 7.16
రెండో 4,134 8.26
మూడవ 1,133 5.66


