సాగులో విత్తన ఎంపికకు ప్రాధాన్యమివ్వాలి
నిడమనూరు : సాగర్ ఆయకట్టులో పండే వరికి ఎంతో డిమాండ్ ఉందని, దానికి అనుగుణంగా మేలైన వరి విత్తనాలను ఎంపిక చేసుకోవాలని వరి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త లింగయ్య సూచించారు. సోమవారం నిడమనూరు మండలంలోని శాఖాపురంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాగులో సన్నాహకంగా వ్యవసాయ శాస్త్రవేత్తలతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం అనుబంధ వరి పరిశోధన క్షేత్రం పలు కొత్త రకాల వంగడాలను, నిరంతరం స్థానిక వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా యాజమాన్య పద్ధతులపై పరిశోధనలు చేస్తుందని తెలిపారు. రైతులకు అందుబాటులో మేలైన వరి విత్తనాలు విక్రయానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కంపాసాగర్ పరిశోధన కేంద్రం అభివృద్ధి చేసిన సన్నరకాలు కేపీఎస్ –6251, కేపీఎస్ –2874 వంటి రకాలతోపాటు, కేఎన్‌ఎం–1639, ఆర్ ఎన్‌ఆర్–1508, జేజేలు–27356 సన్నరకాలతో పాటు దొడ్డు ధాన్యం కేఎన్‌ఎం–118. జేజేఎల్–24423 రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆయకట్టులో నిరంతరం వరి సాగుతో భూముల్లో సారం కోల్పోయి, చౌడు బారుతున్నాయని దీని నిరోధానికి పచ్చిరొట్ట, జీలుగ దుక్కిలో వేసి, నాటే ముందు కలియదున్నాలని శాస్త్రవేత్త లింగయ్య సూచించారు. శాస్త్రవేత్త వి శ్రీధర్ మాట్లాడుతూ వరి సాగులో యాజమాన్య పద్ధతులు వివరించి, నాటు ఆలస్యమయ్యే పరిస్థితులు కనిపిస్తే పెసర్లు సాగు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి మునికృష్ణయ్య, వ్యవసాయ విస్తరణ అధికారి విజయచంద్ర, పశు వైద్యాధికారి సుధాకర్ నాయక్, రైతులు మాజీ సర్పంచ్ ఇరుగుల వెంకట్ రెడ్డి, బొజ్జ లాజర్ సీహెచ్ సూర్యానారాయణ, బారెడ్డి ప్రతాప్ రెడ్డి, రాముడు, వెంకటయ్య పాల్గొన్నారు.
కంపాసాగర్ వరి పరిశోధన కేంద్రం
శాస్త్రవేత్త లింగయ్య


