యాదగిరిగుట్ట ఆలయంలో భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. ఆలయ పరిసరాలు, మాడ వీధులు, క్యూలైన్‌లు, ప్రసాదం, విక్రయశాల, కల్యాణ కట్ట, లక్ష్మీపుష్కరిణి ప్రాంతాల్లో భక్తులు అధికంగా కనిపించారు. ధర్మదర్శనానికి రెండున్నర గంటలు, వీఐపీ దర్శనానికి 30 నిమిషాలు పట్టిందని భక్తులు తెలిపారు. ఉదయం సాయంత్రం బ్రేక్ దర్శనాల సమయంలో మధ్యాహ్నం ఆరగింపు సమయంలో క్యూలైన్లలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్వామివారిని 30వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. స్వామి వారికి నిత్యాదాయం రూ.74,33,486 సమకూరిందని ఆలయ అధికారులు వెల్లడించారు.
సంప్రదాయరీతిలో నిత్య పూజలు
లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం నిత్యపూజలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వయంభూలకు సుప్రభాత సేవ చేపట్టారు. స్వామి, అమ్మవార్లకు ఆరాధన, నిజాభిషేకం, అర్చన చేశారు. ఆలయ ముఖ మండపాల్లో సువర్ణ పుష్పార్చన అష్టోత్తరం, ప్రాకార మండపంలో శ్రీ సుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, వేద ఆశీర్వచనం, తదితర కై ంకర్యాలు గావించారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లకు జోడు సేవలను ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. ఆయా వేడుకల్లో భక్తులు పాల్గొని తమ మొక్కులను చెల్లించుకున్నారు. రాత్రి శయనోత్సవం జరిపించి, ఆలయాన్ని ద్వారబంధనం చేశారు.
యాదగిరిగుట్ట ఆలయంలో భక్తుల రద్దీ


