ఆటో బోల్తా.. వ్యక్తి మృతి
యాదగిరిగుట్ట రూరల్: ఆటో బోల్తా పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన యాదగిరిగుట్ట మండలం గౌరాయపల్లి గ్రామ పరిధిలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన సదా ప్రవీణ్ కుమార్ (36), గురువారం రాత్రి తన సొంత పనుల నిమిత్తం యాదగిరిగుట్టకు చెందిన ఆటో డ్రైవర్ ఉట్కూరి రాజు గౌడ్‌తో కలిసి ఆటోలో గౌరాయపల్లికి వెళ్లాడు. పనులు ముగించుకుని తిరిగి యాదగిరిగుట్టకు వస్తున్న క్రమంలో గౌరాయపల్లి గ్రామ శివారులోని దుర్గమ్మ గుడి సమీపంలో ప్రమాదవశాత్తు ఆటో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న సదా ప్రవీణ్ కుమార్‌కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటో డ్రైవర్ రాజుకు స్వల్ప గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ భాస్కర్ తెలిపారు.
లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం
చిట్యాల: చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామ పరిధిలోని జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. చిట్యాల ఎస్‌ఐ అమ్రీన్ నసీహా తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా దాచెపల్లి మండలం తంగేడ గ్రామానికి చెందిన తోకల రవి(45) అతని తల్లి నాగమ్మ, డ్రైవర్ పోల్ సాగర్‌తో కలిసి కారులో హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. చిట్యాల మండలం వట్టిమర్తి పరిధిలోని దూన్ పంజాబి దాబా వద్దకు రాగానే దాబా నుంచి లారీ అకస్మాత్తుగా జాతీయ రహదారిపైకి వచ్చి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న రవికి తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతడిని వెంటనే నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరుడు తోకల శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
బుచ్చిరెడ్డికి
స్ఫూర్తి పురస్కారం
కనగల్ : బాల సాహిత్యంలో చేస్తున్న కృషికి గాను కోమటిరెడ్డి బుచ్చిరెడ్డిని వసుంధర విజ్ఞాన వికాస మండలి (కరీంనగర్) స్ఫూర్తి పురస్కారానికి ఎంపిక చేసినట్లు జ్యూరీ కమిటీ శుక్రవారం ప్రకటించింది. త్వరలో హైదరాబాద్ జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారం అందజేయనున్నట్లు నిర్వాహకుడు వైద్యుల మధుకర్ తెలిపారు. ప్రస్తుతం బుచ్చిరెడ్డి కనగల్ మండల పరిధిలోని చినమాదారం ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.


